
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోతుందనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటిదాకా సింగరేణి ఎన్నికల కోసం ముఖ్యమంత్రి ప్రచారం చేసిన సందర్భాల్లేవన్నారు.
సింగరేణి ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ నియమనిబంధనలు తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నేరుగా రంగంలోకి దిగి విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారన్నారు. అయినా అధికార పార్టీకి భంగపాటు తప్పదని పొంగులేటి హెచ్చరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో సింగరేణి ఎన్నికలపై ప్రతిరోజూ సమీక్షించడంతోనే టీఆర్‌ఎస్ భయం తెలిసిపోతోందన్నారు. వారసత్వ ఉద్యోగాలపై ఎవరి చిత్త శుద్ధి ఏమిటో, ఎవరు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమేనా?.. అని సవాల్ చేశారు.