
సాక్షి, హైదరాబాద్: అం బేద్కర్ రాసిన రాజ్యాంగం, భారత పార్ల మెంటు చేసిన చట్టాలు కాకుండా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ రాజ్యాంగం అమలవుతోందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాజ్యాంగం అమల్లో ఉన్నందునే తమ పార్టీని అకారణంగా అసెంబ్లీ నుంచి బయటకు పంపించి చట్టాలు చేసుకుంటున్నారని బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.
వాళ్లే పొగుడుకుని, వాళ్లే చట్టాలు చేసుకుంటున్న తీరు పాఠశాలల్లో జరిగే ‘సెల్ఫ్ గవర్నమెంట్’ను తలపిస్తున్నాయని అన్నారు. లక్షలాది రూపాయలను కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకునేందుకు వీలుగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును అసెంబ్లీలో పెట్టారన్నారు. సభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ బిల్లు కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు.