
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల దోపిడీని ప్రభుత్వమే అనుమతినిచ్చే విధంగా తిరుమలరావు కమిటీ నివేదిక ఉందని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేటు విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయని శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
దోపిడీని అరికట్టడానికి ఏర్పాటు చేసిన తిరుమలరావు కమిటీ ఏటా 10 శాతం ఫీజులను పెంచుకునేలా నివేదిక ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. నివేదికను చూస్తే ప్రైవేటు విద్యాసంస్థలు కమిటీని ప్రలోభానికి గురిచేసినట్టుగా ఉందన్నారు.
యూనివర్సిటీ, ప్రభుత్వ విద్యారంగాలను అభివృద్ధి చేయడానికి చర్యలేమీ తీసుకోకుండా, ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానం ఉందని విమర్శించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగం, ప్రైవేటు విద్యాసంస్థలపై నియంత్రణ వంటి వాటిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు.