
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో అసలు సూత్రధారులు బయటకు రాకుండా, కుట్రకోణాన్ని చేర్చకుండా కేవలం నిందితుడు శ్రీనివాస్‌కే విచారణను పరిమితం చేసి, ముగించాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ పక్కదోవ పడుతున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ రూపొందించిన అభియోగపత్రాన్ని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే అభియోగపత్రం విడుదల చేస్తున్నామన్నారు. చంద్రబాబు ద్వారా నియమితులైన పోలీసుల ఆధ్వర్యంలో కేసు విచారణ సక్రమంగా సాగడం లేదని చెప్పారు. ఈ కేసును కేవలం ఐపీసీ సెక్షన్ 307కే పరిమితం చేశారని, కుట్రకోణానికి సంబంధించిన సెక్షన్లను చేర్చలేదని తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే సీఎం, మంత్రులు, డీజీపీ మాట్లాడారంటే హత్యాయత్నం గురించి వారికి ముందే తెలిసినట్లుగా ఉందన్నారు. నిందితుడు శ్రీనివాస్ వీఐపీ లాంజ్ వరకు కత్తిని ఎలా తీసుకెళ్లగలిగాడు? ఎవరి సహకారంతో తీసుకెళ్లాడో తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్‌పై జరిగిన యత్యాయత్నం గురించి సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేశారని, ఆయన మాటలను చూస్తే హత్యాయత్నం తప్పిపోయిందనే అక్కసు వెళ్లగక్కినట్లుగా ఉందన్నారు.
టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అభియోగపత్రంలోని కీలకాంశాలు..
‘‘జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక దాగి ఉన్న కుట్ర కోణంపై విచారణ జరగడం లేదు. సెక్షన్ 120(బి) ప్రకారం హత్యకు యత్నించిన వ్యక్తితోపాటు తెరవెనుక సూత్రధారులు, పాత్రధారులపైనా తప్పనిసరిగా విచారణ జరగాలని నిరూపిస్తున్న అంశాలను వైఎస్సార్‌సీపీ ప్రజల ముందు ఉంచుతోంది.
- జగన్‌పై హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి రెండంచెల భద్రతా వలయాన్ని దాటుకుని ఎయిర్‌పోర్టులోకి ఎలా ప్రవేశించింది?
- శ్రీనివాస్ సొంత చిన్నాన్న ఠాణేలంక గ్రామానికి ఉప సర్పంచి. ఆయన టీడీపీ సానుభూతిపరుడు. ఠాణేలంక గ్రామంలో శ్రీనివాస్ కుటుంబానికి 2 ఇళ్ల నిర్మాణానికి అక్కడి జన్మభూమి కమిటీ ఆమోదం తెలిపింది. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఏ పార్టీ అభిమానులో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఏనాడూ వైయస్సార్‌సీపీ అభిమానులు కాదు. ఠాణేలంక ప్రజలంతా ఈ విషయం చెబుతున్నారు.
- జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర డీజీపీ చేసిన ప్రకటనలు పలు సందేహాలకు తావిస్తున్నాయి.
- ఆ కత్తిపోటు కరోటిడ్ ఆర్టరీకి(మెడలో కీలక రక్తనాళం) తగిలి ఉంటే జగన్ ప్రాణాలు పోయేవన్న నిజాన్ని ఎందుకు దాస్తున్నారు?
- తనకు ప్రాణహాని ఉందని నిందితుడు చెప్పాడు. ఇది నిజంగా చంద్రబాబు పన్నిన పన్నాగం కాకపోతే, టీడీపీ ప్రభుత్వం దీని వెనుక లేకపోతే నిందితుడి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికుంది?
- ఐపీసీలోని 120(బి) ప్రకారం నేరం చేసిన వ్యక్తితోపాటు, నేరానికి పన్నిన కుట్రపైనా విచారణ జరిగితేనే ఈ అంశాలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి’’