
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజావేదిక తమదంటూ టీడీపీ నేతలు గొడవ చేయడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కొత్త ప్రభుత్వానికి వెళ్తానన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ఈ నెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫిరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం ఆ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికలో సమావేశాలు నిర్వహించొద్దని టీడీపీ నేతలు అనడం సరికాదన్నారు. అది చంద్రబాబు డబ్బులతోనో లేక ఆయన తాత ఆస్తులతోనో కట్టింది కాదన్నారు. ప్రజావేదికపై అధికారులతో టీడీపీ నేతలు గొడవ పెట్టుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అధికారులపై దాడులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజాదర్బార్‌లో కీలక ఫైళ్లు ఏముంటాయి?
ప్రజావేదికను ప్రభుత్వానికి అప్పజెప్పమని నోటీసులు ఇచ్చినా టీడీపీ నేతలు ఖాళీ చేయలేదని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదిక ప్రభుత్వ ఆస్తి అని, అక్కడ ప్రజా సమస్యల ఫైళ్లు మాత్రమే ఉండాలన్నారు. అంతేకాని సింగపూర్‌తో ఒప్పందాలు, హెరిటేజ్ ఆస్తుల వివరాలు దాచుకోవడానికి అది చంద్రబాబు ఆస్తి కాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సొమ్మును ఆదా చేయాలని చూస్తే.. టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ల సమావేశం కచ్చితంగా ప్రజావేదికలోనే నిర్వహించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment