
పట్నా: తమ పార్టీని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో విలీనం చేయాలంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారని బిహార్ మాజీ సీఎం, ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన ప్రకటన చేశారు. ఈ విలీనం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిని ప్రకటించవచ్చని ఆయన తెలిపారని కూడా రబ్రీదేవి వెల్లడించారు. ‘సీఎం నితీశ్ తరఫున ప్రశాంత్ మమ్మల్ని కలిశారు. రెండు పార్టీలను విలీనం చేసి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని చెప్పారు. ఒక సందర్భంలో నాకు బాగా కోపం వచ్చి ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని కోరా’ అని పేర్కొన్నారు.
రెండు పార్టీలను కలపాలంటూ నితీశ్‌కుమార్ చేసిన ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ తన వద్దకు తెచ్చారని ఇటీవల తన జీవిత చరిత్ర పుస్తకంలో లాలూ వెల్లడించారు. రబ్రీదేవి వ్యాఖ్యలపై జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. జేడీయూలో చేరక మునుపు అనేక పర్యాయాలు లాలూతో భేటీ అయిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, అప్పట్లో తాము చర్చించిన విషయాలను వెల్లడిస్తే ఆయన ఇబ్బందుల్లో పడతారని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment