
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై పట్టుసాధించాలనే దిశగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలతో వారంలో కనీసం రెండు సార్లు సమావేశమవ్వాలని ఆమె యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను సమీక్షించినప్పుడు పార్టీ నేతలకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం కొరవడిందనేది స్పష్టమైంది. దీంతో ప్రియాంక గాంధీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడాలని నిశ్చయించుకున్నారు’ అని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. గత బుధవారం ప్రియాంక.. ఆమె తల్లి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో కలిసి రాయ్‌బరేలీ నియోజకవర్గాన్ని సందర్శించారు.