న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న ప్రభుత్వ యోచనను కాంగ్రెస్ ‘రాజ్యాంగ ధిక్కారం’గా పేర్కొంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందినట్లయితే భారత ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అనే అర్థంపర్థం లేని ప్రజాస్వామ్య వ్యతిరేక వాదనతో ఏకకాలంలో ఎన్నికలకు ప్రభుత్వం యత్నిస్తోంది.
ఈ ప్రయత్నం నియంతృత్వానికి మరో ఉదాహరణ. చెప్పుకోవటానికి మంచిగా అనిపించే ఈ యోచన..ప్రభుత్వ గిమ్మిక్. ఏకకాలంలో ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగంలో కనీసం 10 సవరణలు చేయాలి. ఇందుకు మూడింట రెండొంతుల మెజారిటీ ప్రభుత్వానికి ఉందా?’ అని ప్రశ్నించారు. ఏకకాలంలో ఎన్నికలంటే ప్రభుత్వాన్ని, ప్రతినిధులను ఎన్నుకునేందుకు ప్రజలకు గల హక్కును నిరాకరించటమేనన్నారు.