సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఓ వైపు.. సొంత పార్టీలో ఆశావహుల ఆందోళనలు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. పార్టీ టికెట్ ఆశిస్తున్న నాయకుల ఆందోళనలకు గత కొద్దిరోజులుగా గాంధీ భవన్ వేదికగా మారింది. తొలి నుంచి పార్టీలో పనిచేసిన వారికే టికెట్ కేటాయించాలంటూ పలువురు నాయకుల మద్దతుదారులు గాంధీ భవన్ వద్ద తమ నిరసన తెలుపుతున్నారు. సోమవారం ఉదయం నుంచి తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో పలు సీట్లపై ఆశలు పెట్టుకున్న వారు ఆయా స్థానాలు తమకే కేటాయించాలంటూ గాంధీ భవన్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
రెండు మూడు రోజుల నుంచి ఖానాపూర్, మల్కాజ్‌గిరి నియోజవర్గాలకు చెందిన కార్యకర్తలు గాంధీ భవన్ వద్ద దీక్ష చేపట్టగా.. సోమవారం వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆందోళనకు దిగారు. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో టీపీసీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. పోలీసులు సహకారంతో గాంధీ భవన్ గేట్లకు తాళాలు వేయించి.. లోనికి ఎవరినీ అనుమతించొద్దని ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment