సాక్షి, పశ్చిమగోదావరి : దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. ఆహ్వాన పత్రికలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మిల పేర్లు లేకపోవడంతో వివాదం మొదలైంది. ఎంపీల పేర్లు లేకుండా అన్నీ తానై నడిపించినట్టుగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యవహరించడంతో మాజీ మంత్రి హరిరామజోగయ్య తదితరులు మనస్తాపం చెందారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ఆహ్వాన పత్రిక తెలుగుదేశం పోస్టర్‌లా ఉందంటూ మండిపడ్డారు. శనివారం సాయంత్రం పాలకొల్లులోని గాంధీబొమ్మల సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఆయన అందరివాడు..
మాజీ మంత్రి హరిరామజోగయ్య మాట్లాడుతూ.. ‘దర్శకరత్న దాసరి అందరివాడు. ఏ పార్టీలో కొనసాగిన ఆయనను అందరూ అభిమానిస్తారు. పాలకొల్లులోని ప్రముఖులందరం కలిసి దాసరి కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం విరాళాలు ప్రకటించాం. స్థానిక ఎమ్మెల్యేను గౌరవించాలనే ఉద్దేశంతో నిమ్మలను కార్యక్రమంలో ముందుండాలని కోరాం. కానీ, ఇవాళ ప్రకటించిన ఇన్విటేషన్ చూస్తే.. అది పక్తు టీడీపీ పోస్టర్‌లా ఉంది. అందరికి సంబంధించినదిలా కనపడడం లేదు. వాళ్ల తాలూకు మంత్రులు, ఎంపీలు, కాబోయే ఎంపీల పేర్లున్నాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదు. దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment