పంజాబీ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరైన డోల్‌ను భలే రంజుగా వాయిస్తున్న ఈ ఫొటోలో అమ్మాయి జహన్ గీత్ దేవల్. పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. వాస్తవానికి ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వచ్చింది ఆమెకు ఇప్పుడే. అయినా ఊరూరూ తిరుగుతూ ఓటు వెయ్యండహో అంటూ డోలు వాయిస్తూ ఇతరుల్లో స్ఫూర్తి నింపుతోంది. పంజాబ్‌లో అమ్మాయిలు డోలు వాయించడమంటేనే అదొక వింత. అది మగవాళ్లు మాత్రమే వాయించే వాద్య పరికరం అని పేరుంది. ఆ అడ్డుగోడల్ని ఛేదించి నాలుగేళ్ల క్రితం అంటే పద్నాలుగేళ్ల వయసులోనే జహన్ డోలు పట్టింది. సాధారణంగా పంజాబ్‌లో డోలుని శుభకార్యాల్లో వాయిస్తారు. ‘‘నేను తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. ఫస్ట్ టైమ్ ఓటు హక్కు వినియోగించుకునే వాళ్లందరూ ఈసారి తమ ఓటుహక్కు వినియోగించుకోవాలి. తమకు నచ్చిన ప్రతినిధిని ఎంచుకోవాలి‘‘ అంటూ ప్రచారం చేస్తున్నారు ఆమె. ‘‘మనం రాజకీయ నాయకుల్ని గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాం. వారిలో ఎంత ప్రతిభ ఉందో తెలీకుండానే ఆహో ఓహో అని అంటూ ఉంటాం. ఒక్కోసారి తల్లిదండ్రుల ప్రలోభాలకి కూడా లొంగిపోతాం. కానీ అలా చెయ్యకూడదు. మనకి బంగారు భవిష్యత్ ఎవరి వల్ల వస్తుందో ఆలోచించి ఓటు వెయ్యాలి‘‘ అని అంటున్నారు జహన్.
Comments
Please login to add a commentAdd a comment