ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అనైతికతకు పాల్పడినట్లు స్వయంగా తానే అంగీకరించిన రాష్ట్ర మంత్రి సి. ఆదినారాయణరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఎంత మాత్రం లేదని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక ఫ్యాక్షనిస్టునని ఆయన ఘనంగా చెప్పుకోవడం దారుణమని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాచమల్లు మాట్లాడుతూ మంత్రి ఆది జగన్‌పై చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.
ప్రత్యేక హోదా ఇస్తే వైఎస్సార్ కాంగ్రెస్ బీజేపీకి మద్దతు నిస్తుందని జగన్ ఒక ఇంటర్యూలో చెబితే దానిని మంత్రి యాగీ చేయడం విడ్డూరమన్నారు. హోదా వస్తే మొత్తం రాష్ట్ర ప్రజలు బాగు పడతారని, తమ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కనుక హోదా ఇచ్చే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామన్నారు. ఇంతకూ మంత్రి ప్రత్యేక హోదాకు, అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఐదేళ్లు హోదా ఇస్తామంటే బీజేపీ పదేళ్లు ఇస్తామని చెప్పిందని, చంద్రబాబు 15 ఏళ్లు కావాలని కోరారన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేసి ప్రత్యేక హోదాను అటకెక్కించినా కూడా వైఎస్సార్‌సీపీ గట్టిగా పోరాడుతోందని గుర్తుచేశారు.
ఆ పదాలకు అర్థం ఏమిటో...
జగన్ క్రిస్టియన్ కాదని, క్రిటియన్ కూడా కాదని, ఆయన కస్టోడియన్ అని మంత్రి ఆదినారాయణరెడ్డి అర్థం లేని విమర్శలు చేశారన్నారు. కస్టోడియన్ అంటే కస్టడీకి (జైలుకు) వెళ్లేవాడేనే అర్థంతో ఆదినారాయణరెడ్డి చెప్పారని, అయితే మంత్రి అబద్ధాలు చెప్పబోయి సత్యాన్ని పలికారని రాచమల్లు అన్నారు. కస్టోడియనే... అంటే సంరక్షకుడు అని అర్థమని, ఈ రాష్ట్ర ప్రజలను సంరక్షించడానికి ఉధ్బవించినవాడు...’ అని మంత్రి గుర్తించాలని ఆయన అన్నారు.
గత ఎన్నికల్లో రుణ మాఫీ గురించి ఒక్క అబద్ధం ఆడితే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడని, కాని జగన్ అబద్ధాలకు దూరమన్నారు. జగన్ ఎలాంటి వాడు అనేది భవిష్యత్తే తేల్చుతుందన్నారు. 2009లో వైఎస్ వల్లనే 30 సీట్లు తగ్గాయని ఆది మాట్లాడారంటే ఆయన కడుపులో వైఎస్ కుటుంబంపై ఎంత విషయం ఉందో అర్థం అవుతోందన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్తున్నది చంద్రబాబేనని ఆయన అన్నారు. కేççసుల భయం వల్లనే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. తాను సీనియర్‌నని, చంద్రబాబు అనుభవజ్ఞుడని చెప్పుకోవడాన్ని రాచమల్లు తప్పు పడుతూ... ‘పంది పెంత బలిసినా...ఎప్పటికీ నంది కాలేదు... పంది పందే...’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment