
హైదరాబాద్: బీజేపీ, టీఆర్‌ఎస్‌లు అంపశయ్యపై ఉన్నాయని, అధికారం పోయే దశలో కూడా ప్రజాకూటమి గెలిస్తే పగ్గాలు ఆంధ్రాకు పోతాయని తెలంగాణ ప్రజలను కేసీఆర్ రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానని చెప్పిన కేసీఆర్.. ఓడిపోతున్నా నని బహిరంగంగా ఒప్పుకున్నందుకు, ఆయన నిజాయితీకి అభినందనలు చెప్పాలన్నారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ గాంధీనగర్‌లోని ఎన్నికల కార్యాలయంలో ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మందడి అనిల్ కుమార్ యాదవ్ తయారు చేసిన నియోజవర్గ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి, ఓడిషా ఇన్‌చార్జ్ షేక్‌మస్తాన్‌వలీతో కలసి విడుదల చేశారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా వాళ్ళ పెత్తనం అంటూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఆంధ్రాకు వెళ్ళడానికి పాస్‌పోర్టులు, వీసాలు కావాలా అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.