సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, కొందరు భజన పరులు మాత్రమే టీఆర్‌ఎస్ వైపు ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. కూటమిని గెలిపించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో రఘువీరాతో పాటు పలువురు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన అనంతరం రఘువీరా మాట్లాడారు.
కేసీఆర్ పాలనపై ప్రజల్లో ద్వేషం, అసహ్యం నెలకొందని విమర్శించారు. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థికి 15 కోట్లకు పైగా కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా వాహనాలు, 108 వాహానాల్లో డబ్బులు తరలిస్తుంటే ఎలక్షన్ కమిషన్ ప్రేక్షకపాత్ర వహిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని చూస్తే టీఆర్‌ఎస్‌కు వణుకు పుడుతుందని అందుకే బరితెగించి అక్రమంగా అరెస్టు చేశారన్నారు.
రేవంత్‌ను అరెస్ట్ చేయడంతో టీఆర్‌ఎస్ ఓటమి ఖరారయిందని జోస్యం చెప్పారు. అరెస్టు చేసిన అధికారులపై వెంటనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు సార్లు ఎన్నికల మేనిఫెస్టో మార్చి చివరకు కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టారని ఎద్దేవ చేశారు. కారుకు ఓటేస్తే కమలంకు ఓటేసినట్లేనని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment