సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఈసారి రాష్ట్ర అసెంబ్లీలో, అలాగే క్యాబినెట్‌లో ఎక్కువ మంది మహిళలను చూడదల్చుకున్నాను’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఫిబ్రవరి 24వ తేదీన బెంగళూరులోని బీఎల్డీ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగిన మహిళా శక్తి సమ్మేళనంలో వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పరమేశ్వరల వైపు తిరిగి ఈసారి ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వడంటూ సభా ముఖంగానే వారిని ఆదేశించారు. చివరకు కర్ణాటక అసెంబ్లీలో 244 సీట్లకుగాను 15 మంది మహిళలకు మాత్రమే పార్టీ టిక్కెట్లు లభించాయి.
దాదాపు ఐదు నెలల అనంతరం రాహుల్ గాంధీ జూలై 17వ తేదీన 51 మంది సభ్యులతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాను విడుదల చేశారు. వారిలో 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 10 మంది ప్రత్యేక ఆహ్మానితులు ఉన్నారు. మొత్తం 51 శాతం సభ్యుల్లో ఏడుగురంటే ఏడుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే మహిళలకు 13.7 శాతం ప్రాతినిధ్యం లభించింది. ఆ ఏడుగురు మహిళల్లో కూడా నలుగురు శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ఆహ్వానితులను తీసివేస్తే మొత్తం 23 మంది సీడబ్ల్యూసీ సభ్యులో ముగ్గురు మాత్రమే మహిళలు ఉన్నారు. వారు ఎవరంటే సోనియా గాంధీ, అంబికా సోని, కుమారి సెల్జా. ఈ రకంగా చూస్తే మహిళలకు 13 శాతమే ప్రాతినిధ్యం లభించినట్లు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, రజనీ పాటిల్, ఆశా కుమారిలను శాశ్వత ఆహ్వానితులుగా తీసుకోగా అఖిల భారత మహిళా కాంగ్రస్ అధ్యక్షురాలు సుశ్మితా దేవ్‌ను ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకున్నారు. అంతకు 72 గంటల ముందే రాహుల్ గాంధీ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు సత్వర ఆమోదానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం ఇక్కడ గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎక్కువ మంది మహిళలకు సీట్లు ఇవ్వలేక పోయామని సమర్థించుకున్నారు. మరి పార్టీ విషయంలో ప్రాతినిధ్యం కల్పించక పోవడాన్ని రాహుల్ గాంధీ ఎలా సమర్థించుకుంటారు?
Comments
Please login to add a commentAdd a comment