
ఈ హామీకి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని..
రాయ్‌పూర్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో సోమవారం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఆయన పేద ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ఏ దేశం అమలు చేయ్యని విధంగా కొత్త పథకం తీసుకువస్తామని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని పేదలకు కనీస ఆదాయాన్ని అందజేస్తామని తెలిపారు. ఆకలితో పేదరికంలో మగ్గుతున్న పేద ప్రజలకు ఈ పథకం ద్వారా తోడ్పాటు అందజేస్తామని అన్నారు.
ప్రతి పేద వ్యక్తి జీవించడానికి కనీస ఆదాయం కావాలి. అలాంటి వారికి కనీస ఆదాయం అందించడం ద్వారా భారత్‌లో ఆకలి, పేదరికాన్ని దూరం చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇది తమ భవిష్యత్తు కార్యచరణ అని.. ఈ హామీకి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. దేశ ప్రజల కోసం బీజేపీ ఏమి చేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మన దేశంలో ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తుంటే.. మనం నవభారతాన్ని నిర్మించలేమని పేర్కొన్నారు. గతవారం తన సోదరి ప్రియాంక గాంధీకి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన రాహుల్.. తాజా హామీతో దేశంలో ఎన్నికల వేడిని పెంచారు.