సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందన్న అంచనాల నేపథ్యంలో సొంత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తప్పిదాలను ఎండగడుతూ సిన్హా రాసిన వ్యాసం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే మోదీ సర్కారుపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం విమర్శనాస్త్రాలు సంధించగా.. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'లేడిస్ అండ్ జెంటిల్మెన్. మీ కోపైలట్, ఆర్థికమంత్రి మాట్లాడుతున్నారు. త్వరగా సీటు బెల్టు పెట్టుకొని, దృఢంగా కూర్చొండి. మన విమానం రెక్కలు విరిగిపోయాయి' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఎవరి మాట వినకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్నదని రాహుల్ గతంలో విమర్శించిన సంగతి తెలిసిందే.
‘ఐ నీడ్ టూ స్పీక్ అప్ నౌ’ పేరిట యశంత్ సిన్హా తాజాగా రాసిన వ్యాసంలో కేంద్రం కీలకంగా భావించిన నోట్లరద్దు, జీఎస్టీలపైనే ప్రధానంగా విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను తన ప్రభుత్వమే నట్టేట ముంచిందని చెప్పుకొచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన తప్పులపై ఇప్పటికీ కూడా తాను స్పందించకపోతే భారతీయుడిగా తన ప్రాథమిక విధిని విస‍్మరించినట్లేనన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల సమీప భవిష్యత్తులో కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతేకాదు జీడీపీ తగ్గిపోవటానికి సాంకేతిక కారణాలే కారణమన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను యశ్వంత్ తప్పుబట్టారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉండగా దర్యాప్తు సంస్థల దాడులను ఖండించే వాళ్లమని ఆయన గుర్తు చేశారు. అధికారం అండతో ప్రత్యర్థులపైకి ఉసిగొల్పటం సరికాదంటూ ఆయన పరోక్షంగా ప్రభుత్వానికి సూచించారు. వాజ్‌పేయి హయాంలో యశ్వంత్ సిన్హా ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే.
‘ఐ నీడ్ టూ స్పీక్ అప్ నౌ’ పేరిట ఆయన రాసిన ఆర్టికల్‌లో కేంద్రం కీలకంగా భావించిన నోట్లరద్దు, జీఎస్టీలపైనే ప్రధానంగా విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను తన ప్రభుత్వమే నట్టేట ముంచిందని చెప్పుకొచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన తప్పులపై ఇప్పటికీ కూడా తాను స్పందించకపోతే భారతీయుడిగా తన ప్రాథమిక విధిని విస‍్మరించినట్లేనన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల సమీప భవిష్యత్తులో కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.