పట్నా: బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఏ చిన్న అవకాశం దొరికినా పార్టీపై నిప్పులు చెరిగే ఈ షాట్‌గన్.. తాజాగా రాజస్థాన్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై స్పందించారు. దేశంలో బీజేపీకి ట్రిపుల్ తలాక్ చెప్పిన తొలి రాష్ట్రం రాజస్థానేనని ఆయన పేర్కొన్నారు.
'బ్రేకింగ్ న్యూస్: అధికార పార్టీకి విపత్కర ఫలితాలు వచ్చాయి. బీజేపీకి ట్రిపుల్ తలాక్ చెప్పిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. అజ్మీర్: తలాక్, అల్వార్: తలాక్, మండల్‌గఢ్: తలాక్. మన ప్రత్యర్థులు రికార్డు మెజారిటీతో ఎన్నికలను గెలుస్తూ.. మనకు ఝలక్ ఇస్తున్నారు' అని శత్రుఘ్న శనివారం ట్వీట్ చేశారు. ఇప్పటికైనా బీజేపీ మేలుకొని.. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, లేకపోతే త్వరలోనే బీజేపీకి టాటా-బైబై చెప్పాల్సిన ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇటీవల వెలువడిన రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరిగిన కీలకమైన ఉప ఎన్నికల్లో కమలదళానికి చుక్కెదురైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొని మండల్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో, అజ్మీర్, అల్వార్ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించింది. ఈ ఫలితాలు వసుంధరారాజే ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment