
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ర్యాలీ కోసం రాజస్తాన్ ప్రభుత్వం రూ.7 కోట్లు ఖర్చు చేస్తోంది. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నిర్వహించే ఈ భారీ ర్యాలీ ఈ నెల 7న జైపూర్‌లో జరగనుంది. ప్రజల తరలింపునకు అయ్యే ఖర్చును వివిధ పథకాల నిధుల నుంచి మళ్లించినట్లు కూడా అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన 12 సంక్షేమ పథకాల లబ్ధిదారులైన దాదాపు 2.5లక్షల మంది ఈ ర్యాలీకి తరలివస్తారని అంచనా వేస్తున్నారు. జైపూర్‌లోని అమృదోన్ కా బాగ్ స్టేడియంలో జరిగే సభకు 33 జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రభుత్వం 5,579 బస్సులను కేటాయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.7.2కోట్లు ఖర్చు పెడుతోందని సాధారణ పాలనా విభాగం తెలిపింది.