కమల్, రజనీ కామెంట్లతో కలకలం | Rajinikanth And Kamal Haasan Together In Politics For Tamilnadu | Sakshi
Sakshi News home page

సరిలేరు.. మాకెవ్వరు

Published Thu, Nov 21 2019 7:55 AM | Last Updated on Thu, Nov 21 2019 8:13 AM

Rajinikanth And Kamal Haasan Together In Politics For Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై : కోలివుడ్‌ వెండితెర వేల్పులైన కమల్‌హాసన్, రజనీకాంత్‌ నాడు వెండితెరపై నేడు రాజకీయతెరపై “సరిలేరు మాకెవ్వరు’ అన్నట్లుగా వ్యవహరించడం ప్రారంభించారు. నాలుగు దశబ్దాలుగా స్నేహానికే పరిమితమైన వారిద్దరూ ఇక రాజకీయ భాగస్వాములం అంటూ కొత్త అంశానికి తెరదీశారు. ప్రజల కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమని కమల్, రజనీ చేసిన కామెంట్లు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేల కూటములను మట్టికరిపించేందుకు సరికొత్త వ్యూహం సిద్ధం అవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రజనీ వర్సెస్‌ అన్నాడీఎంకే.. 
1996 నాటి ఎన్నికల సమయంలో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యానాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆకస్మిక మార్పులకు దారితీసాయి. “అన్నాడీఎంకేకు ఓటేస్తే మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు’ అంటూ రజనీ ఇచ్చిన సందేశం ఓటర్లను తీవ్రస్థాయిలో ప్రభావితం చేసింది. అన్నాడీఎంకే ఓటమిపాలై డీఎంకే, తమిళనాడు మక్కల్‌ కట్చి కూటమి గెలిచింది. ఇక రజనీ రాజకీయం ప్రవేశమే తరువాయని అందరూ అంచనా వేశారు. అభిమానులూ ఎదురుచూశారు. పలు పార్టీలు ఆయనను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. అయితే రెండు దశాబ్దాల తరువాత రజనీ రాజకీయ ప్రవేశం చేశారు. 2017 డిశంబరు  31వ తేదీన చెన్నై కోడంబాక్కంలో రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానుల సమక్షంలో “నాన్‌ అరసియల్‌కు వరువదు ఉరుది’ (నేను రాజకీయాల్లో రావడం ఖాయం) అంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆ మాటలు అని రెండేళ్లు పూర్తికావస్తున్నా పార్టీని స్థాపించకుండా అడపాదడపా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రజనీ ఎండగడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.

లోకనాయకుడి రాజకీయ రంగప్రవేశం.. 
అయితే రాజకీయాల జోలికే రాకుండా సినిమాలకు పరిమితమైన కమల్‌హాసన్‌ అకస్మాత్తుగా రాజకీయ ప్రవేశం చేసి మక్కల్‌ నీది మయ్యం పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోకున్నా గణనీయమైన ఓట్లు సాధించిన ఘనత దక్కించుకున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం సిద్ధమవుతున్నారు. ఇలా వేర్వేరు బాణీల్లో కమల్, రజనీ రాజకీయాలు సాగుతుండగా, ఇద్దరూ కలిసే అవకాశం ఉందాని గతంలో ప్రశ్నించినవారిని ఇద్దరూ సాధారణ సమాధానంతో సరిపెట్టారు. ఇదిలా ఉండగా, కమల్‌హాసన్‌ జన్మదిన వేడుకల్లో రజనీ ఉత్సాహంగా పాల్గొన్నారు. రజనీ, కమల్‌లు రాజకీయ అజ్ఞానులని సీఎం ఎడపాడి ఇటీవల ఒక సభలో చేసిన విమర్శలకు ఈ నెల 17వ తేదీన జరిగిన కమల్‌ జన్మదిన సభలో రజనీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి అవుతానని ఎడపాడి ఏనాడై కలగన్నారా.. అలానే రాబోయే రోజుల్లో పలు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయని రజనీ తనదైన శైలిలో మాటల తూటాలను పేల్చారు.

చేయి కలపాలని పలువురి ఆకాంక్ష.. 
రాజకీయాల్లో కమల్, రజనీ ఏకం కావాలని కమల్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న దర్శకులు, నటుడు విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్, కమల్‌ సోదరుడి కుమార్తె సుహాసిని ఆకాంక్షించారు. వారిద్దరి మాటలను నిజం చేస్తున్నట్లుగా తామిద్దరూ కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూ కమల్, రజనీ మంగళవారం అకస్మాత్తుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 44 ఏళ్లుగా కలిసే ఉన్నామని కమల్‌ వ్యాఖ్యానించారు. కమల్, రజనీల ప్రకటన రాజకీయాల్లో కొత్త చర్చకు తెరదీసింది. ఇద్దరూ వేర్వేరు పార్టీలతో కలిసి పనిచేస్తారా, కమల్‌ పార్టీలో రజనీ చేరుతారా, ఇద్దరూ కలిస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? ఇలా అనేక కోణాల్లో రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2021 ఏప్రిల్‌ లేదా మేలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే బలమైన ప్రధాన పార్టీలు. కమల్, రజనీ కలిసిన మూడోపార్టీని ఎదుర్కోవడం ఆ రెండు పార్టీలకు సవాల్‌గా మారే అవకాశం ఉంది.
 
కమలే సీఎం అభ్యర్థి: శ్రీప్రియ 
ఇద్దరు కలయిక సంచలన వ్యాఖ్యలు ఇంకా సద్దుమణగక ముందే నటి శ్రీప్రియ మరో వివాదాస్పద చర్చకు తెరదీసారు. రజనీ, కమల్‌ కలిసి పనిచేసినా ముఖ్యమంత్రిగా కమల్‌ ఉండాలని కోరుకుంటున్నట్లు మక్కల్‌ నీది మయ్యం మహిళా విభాగం నిర్వాహకురాలు, నటి శ్రీప్రియ అన్నారు. మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, కమల్‌హాసన్‌కు ఒడిస్సా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ఇచ్చిన సందర్బంగా బుధవారం ఉదయం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాకు చెందిన పార్టీ ఇన్‌చార్జ్‌లు చెన్నైలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని కమల్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతలతో కమల్‌ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ, తమిళ ప్రజల ప్రయోజనాల కోసం రజనీ, నేను మమేకం అవుతామని చెప్పాను. మేమిద్దరం ఏకం కావడం మా ఇద్దరి స్నేహం కంటే ముఖ్యమైన వార్త. తమిళనాడు కోసం కలిసి పాటు పడతామనేదే అందులోని అర్థం. ఇద్దరం కలిసే తేదీని ఇప్పుడే చెప్పలేను. మా ఇద్దరి స్నేహం కంటే రాష్ట్ర సంక్షేమమే ముఖ్యమని పునరుద్ఘాటించారు. 

ప్రతిపక్షాల వ్యంగోక్తులు.. 
కమల్, రజనీ కలయిక ప్రకటన రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపింది. కమల్, రజనీ కలిసినా ఎంతమాత్రం చింతలేదని ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వ్యాఖ్యానించారు. దివంగత ఎంజీఆర్, జయలలిత వంటి నేతల సామర్థ్యంతో గట్టి పునాదులు కలిగి ఉన్న అన్నాడీఎంకేకు ఎంతమాత్రం చెక్కుచెదరదని ధీమా వ్యక్తం చేశారు. వారిద్దరి కూటమి అన్నాడీఎంకే ముందు తునాతునకలై పోతుందని మంత్రి జయకుమార్‌ అన్నారు. కమల్, రజనీలు రాజకీయాల్లో కంటే సినిమాల్లో కలిసి నటిస్తే మరింత బాగుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌ తంజావూరులో బుధవారం వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement