చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఏడాది మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారానికి పలు పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి జనవరి 1న పూర్తి వివరాలు వెల్లడిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీతో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘నేను, రజనీకాంత్ ఇద్దరం మార్పు కోరుకునేవాళ్లమే. తమిళనాడు కోసం రజనీతో కలిసి పని చేసేందుకు నేను సిద్ధం. మా ఇరువురి మధ్య భావసారూప్యత లేకపోయినా తమిళ ప్రజల కోసం కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం’ అంటూ కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. (చదవండి: 'అధికారంలోకి వస్తే మధురై రెండో రాజధాని')
ఇక సోమవారం నాటి రోడ్ షోలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కమల్ హాసన్.. ‘పొత్తులు కొన్ని సార్లు విడిపోతాయి. మరికొన్ని సార్లు కొత్తవి పుట్టుకువస్తాయి. ప్రస్తుతానికి రజనీకాంత్ పార్టీతో పొత్తు విషయం గురించి నిర్ణయం తీసుకోలేదని’ అన్నారు. ఇక 24 గంటల వ్యవధిలోనే రజనీతో పొత్తుకు సిద్ధం అంటూ కమల్ ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పటికే 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. కమల్ హాసన్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య ‘పొత్తు’పొడిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఎంఐఎం నేతలతో అసద్ సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment