సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశిస్తామంటూ సంకేతాలు ఇచ్చిన తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే వేదికపైకి వస్తే.. ఆ వేదికపై రాజకీయాల గురించి పరోక్షంగా మాట్లాడితే.. అది హాట్ టాపిక్ అవుతుంది. ఆదివారం చెన్నైలో శివాజీ గణేషన్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఇందుకు వేదిక అయింది.
ఈ కార్యక్రమానికి తలైవా రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌తోపాటు, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. కమల్ హాసన్‌పై పరోక్షంగా సెటైర్లు వేయడం చర్చనీయాంశమైంది.
రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు, స్టార్‌డమ్, పేరు ప్రఖ్యాతలు సరిపోవని, అంతకుమించి ఇంకేదో కావాలని రజనీ పేర్కొన్నారు. 'నటుడిని రాజకీయ నాయకుడు చేసే గొప్ప మార్పు ఏదో రావాలి. అది ఏమిటో కమల్ హాసన్‌కు తెలిసి ఉండొచ్చు. రెండు నెలలు కిందట నేను అడిగి ఉంటే అతను చెప్పి ఉండేవాడేమో. కానీ ఇప్పుడు అడిగితే.. 'నా వెంట రా.. నేను చెప్తాను' అంటున్నాడు' అని రజనీ ఛలోక్తులు విసిరారు. అప్పటికీ ప్రేక్షకుల నడుమ కూర్చున్న కమల్ సైతం నవ్వులు కురిపించారు.
రజనీ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావాలంటే సినీ గ్లామర్ మాత్రమే సరిపోదని, ప్రజలతో మమేకమైతేనే రాజకీయాల్లో రాణిస్తామని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని కమల్ తనను ఆహ్వానించారని, పెద్దవాడివి కలిసి వెళదాం అంటూ మిత్రుడిగా ఆయన ఆహ్వానించడం సంతోషానిచ్చిందని చెప్పారు. ఆయనతో వెళితే రాజకీయాలు నేర్పుతాడేమోనని రజనీ చమత్కరించారు.
అంతకుముందు కమల్ హాసన్ మాట్లాడుతూ అధికార అన్నాడీఎంకే సర్కారుపై పరోక్ష విమర్శలు గుప్పించారు. శివాజీ గణేషణ్ కాంస్య విగ్రహం ఏర్పాటులో జాప్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 'రాజకీయాలకు అతీతమైన ప్రజాభిమానం శివాజీ సొంతం. ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఎవరినీ మేం యాచించాల్సిన అవసరం లేదు. ఎవరూ వ్యతిరేకించినా నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యేవాడిని. ఒకవేళ నేను కార్యక్రమం బయట నిలబడినా.. ఈ కార్యక్రమంలో మాత్రం భాగం అయ్యేవాడిని 'అని కమల్ చెప్పారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో కమల్, రజనీ స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం కనిపించింది. ఈ ఇద్దరూ రాజకీయాల్లోకి వస్తున్నామని సంకేతాలు ఇవ్వడంతో.. భవిష్యత్తులో వీరి మధ్య రాజకీయాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.