
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఎన్డీయేను గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాత్రం భిన్నంగా స్పందించారు. మహాకూటమి అనేది కేవలం మీడియా సృష్టి మాత్రమేనని... ఒంటరిగానే బీజేపీని ఎదుర్కోగల సామర్థ్యం తమ పార్టీకి ఉందంటూ వ్యాఖ్యానించారు.
కాగా నరేంద్ర ప్రభుత్వం అసమర్థత వల్లే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారు బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుండగా.. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే వీరికి లోన్లు మంజూరయ్యాయంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇండియా టుడే ప్రతినిధితో మాట్లాడిన రణ్‌దీప్ సూర్జేవాలా.. వివిధ అంశాలపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల గురించి స్పష్టత ఇచ్చారు.
మోదీజీ వీటికి సమాధానం చెప్పాలి..
రఘురాం రాజన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ... ‘2014కు ముందు ఎన్‌పీఏ(నాన్ పర్ఫార్మింగ్ అస్సెట్) విలువ 2.80 లక్షల కోట్ల రూపాయాలు. కానీ నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఆ విలువ 12 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. కేవలం నాలుగేళ్లలో ఇది ఎలా సాధ్యమైందో మోదీజీ సమాధానం చెప్పాలి. అదే విధంగా గతేడాది వెలుగులోకి వచ్చిన బ్యాంకు మోసాల విలువ లక్ష కోట్ల రూపాయలు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎన్డీయే ప్రభుత్వమేనని’ రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఇంధన ధర విషయంలో తామేమీ చేయలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఎక్సైజ్ సైజ్ సుంకాన్ని తగ్గించిందని పేర్కొంటూ... మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడంలేదని ప్రశ్నించారు.
అవన్నీ బోగస్ కేసులు..
మోదీ ప్రభుత్వం అవినీతికి చిరునామాగా మారిందని విమర్శిస్తున్న కాంగ్రెస్.. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బెయిలు పైన బయట ఉన్నారు కదా అన్న ప్రశ్నకు బదులుగా.. అవన్నీ బోగస్ కేసులని, వారిద్దరికి క్లీన్‌చిట్ లభిస్తుందని రణ్‌దీప్ పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమని నైతికంగా దెబ్బతీసేందుకే బీజేపీ ఈ విషయాలను హైలెట్ చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ కుల రాజకీయాలకు అనుకూలమా.!?
కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ డీఎన్‌ఏ కలిగి ఉందనడంలో తన ఉద్దేశాన్ని తెలుపుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. అదే విధంగా అగ్రవర్ణాలకు చెందిన పేదల బాగోగులను కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే బ్రాహ్మణులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉండాలన్నాను. అందులో తప్పేముందంటూ రణ్‌దీప్ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ శివభక్తుడు..
తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివభక్తుడని, ఆయనకు పరమత సహనం మెండుగా ఉందని రణ్‌దీప్ వ్యాఖ్యానించారు. బీజేపీలాగా హిందూ మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకునే కుటిల బుద్ధి తమ నాయకుడికి లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ.. ఆరెస్సెస్‌ను ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చడాన్ని సమర్థిస్తూ.. బీజేపీని నడిపించే ఆరెస్సెస్ భావజాలం భారత్‌కు ఎప్పటికైనా ప్రమాదకరమైందేనని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment