
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వాటిని నిలువరించాల్సిన అవసరం ఉందని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. మంగళవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత నెలలో కూరగాయల ధరలతో పోలిస్తే ఈ నెల ధరలు రెట్టింపయ్యాయన్నారు. సామాన్య, మధ్య తరగతిపై నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందన్నారు. ధరల పెరుగుతున్నా పౌర సరఫరాల శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి ఈటల రాజేందర్ ప్రతిస్పందిస్తూ, ధరల తగ్గింపు చర్యలు తీసుకుంటామన్నారు.
సర్దార్ పటేల్ జయంతి నిర్వహణకు అడ్డుపడిందెవరు?
‘సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని దేశమంతా జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. నిజాం నియంతృత్వ పాలన నుంచి విముక్తి కల్పించిన పటేల్‌ను ఎందుకు విస్మరించారు. పటేల్‌కు నివాళులు అర్పించడంలో ప్రభుత్వానికి అడ్డుపడుతున్న అదృశ్య శక్తి ఎవరు?. ఆ శక్తి కారణంగానే పటేల్ జయంతిని ప్రభుత్వం జరపలేదు.’
– జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పక్ష నేత
నారాయణ, శ్రీచైతన్య ఆత్మహత్యలపై చర్యలు తీసుకోండి
‘నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా ఫీజులు పెంచడంతో భారం భరించలేక చనిపోతున్నారు. ఈ ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలి.’
– ఆర్. కృష్ణయ్య, టీడీపీ
సఫాయి కార్మికులకు వేతనాలివ్వాలి
‘గ్రామాల్లో పని చేస్తున్న సఫాయి కార్మికులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలి. అత్యంత దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారికి భరోసానిచ్చే చర్యలు చేపట్టాలి’.
– రసమయి బాలకిషన్, టీఆర్‌ఎస్
ఉస్మానియా క్యాంపుల్లో సమస్యలు పరిష్కరించండి
‘ఉస్మానియా యూనివర్సిటీపరిధిలోని క్యాంపుల్లో మొహర్రం, దీపావళి, దసరా పండగ సమయాల్లో విద్యుత్ నిలిపివేశారు. ఇతర అనేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించాలి.’ –ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, బీజేపీ