
సాక్షి, హైదరాబాద్ : టీడీపీని వీడినా రేవంత్ రెడ్డి... ఎల్. రమణల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎల్.రమణపై రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. తనతో పాటు పార్టీ మారమని ఏ ఒక్కరినీ కోరలేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. తాను చెప్పాలనుకున్నది చంద్రబాబు నాయుడుకు చెప్పే వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ...‘ రాజకీయంగా నా ఎత్తుగడ నాకుంది. డిసెంబర్ 9న మీట్ ది ప్రెస్‌లో పాల్గొంటా. ఆ తర్వాత కేసీఆర్ ఆలోచనలు అన్నీ నా చుట్టే తిరుగుతాయి. టీడీపీలో ఉంటూ కేసీఆర్‌కు ఉపాధి కూలీ పని చేస్తున్నవారికి నేను చెప్పాల్సింది ఏమీ లేదు.
కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరితే ఎల్. రమణ ఎందుకు మాట్లాడలేదు. కేసీఆర్ దగ్గర డబ్బులు తెచ్చుకుని ఎల్ రమణ నాపై విమర్శలు చేస్తున్నారు. కొడంగల్‌లో సమావేశం పెడతా అంటున్న రమణ...గజ్వేల్, సిద్ధిపేట్‌లో సమావేశం పెడతా అని ఎందుకు చెప్పడం లేదు. చేరాలనుకుంటే ముసుగు తీసి నేరుగా టీఆర్‌ఎస్‌లో ఎల్.రమణ చేరొచ్చు కదా. టీడీపీలో ఉన్న నేతలందరిని టీఆర్‌ఎస్‌లో చేర్చేవరకూ ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడు. నాకు రమణ సర్టిఫికేట్ అవసరం లేదు. చేతనైతే సొంత నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుని గెలవాలి. నా యుద్ధం కేసీఆర్ కూలీలపై కాదు... కేసీఆర్‌పైనే.’ అని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment