సిట్టింగ్‌ జడ్జితో విచారించాలి | Revanth Reddy Demands Sitting Judge Investigation In Human Trafficking Case | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 13 2018 5:04 AM | Last Updated on Thu, Sep 13 2018 5:04 AM

Revanth Reddy Demands Sitting Judge Investigation In Human Trafficking Case - Sakshi

రేవంత్‌రెడ్డి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: మనుషుల అక్రమ రవాణా కేసులో స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల ప్రమేయం ఉందని కాంగ్రెస్‌ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీరితో పాటు టీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు షకీల్, రామలింగారెడ్డితో పాటు కేసీఆర్‌ పీఏగా ఉన్న అజిత్‌రెడ్డిల పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ.. మనుషుల అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్‌ రషీద్‌ ఇచ్చిన వాంగ్మూల కాపీలను మీడియాకు అందజేశారు.

‘రషీద్‌ ఇచ్చిన వాంగ్మూలంలో.. బోధన్‌ తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తనకు పరిచయం చేయగా, పీఏ అజిత్‌రెడ్డి ద్వారా డబ్బులు తీసుకొని కేసీఆర్, హరీశ్‌లు గుజరాత్‌కు చెందిన వారిని అమెరికాకు పంపినట్లు తెలిపాడు. కేసీఆర్‌ లెటర్‌హెడ్‌ మీద 2005లో ఐదుగురు, 2006లో మరో ముగ్గురిని అమెరికా పంపేందుకు సిఫారసు లెటర్‌ ఇచ్చారని చెప్పాడు. హరీశ్‌రావు స్వయంగా భార్య, బిడ్డ పేరుతో రికమండ్‌ లెటర్‌ ఇచ్చి అక్రమ రవాణాకు సహకరించారని రషీద్‌ వాంగ్మూలంలో ఉంది. వీరితో పాటే రామలింగారెడ్డి పేరూ ఉంది. ఇందులో ఎక్కడా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు లేదు. కనీసం తనకు సహకరించినట్లు కూడా లేదు. అయినా అసలు దోషులను వదిలి జగ్గారెడ్డిని ఇరికించారు’అని రేవంత్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో గవర్నర్‌ కళ్లు తెరిచి వాస్తవాలు చూసి, రషీద్‌ వాంగ్మూలంలో ఉన్న కేసీఆర్, హరీశ్‌ సహా ఇతరులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

2007లో మనుషుల అక్రమ రవాణా కేసులపై ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి సిటీ కమిషనర్‌గా ఉన్నప్పుడే 2017లో చార్జిషీట్‌ దాఖలు చేశారని రేవంత్‌ తెలిపారు.  కేసులో వాస్తవాలు దాచి రాజకీయ కక్షలో భాగంగా కాంగ్రెస్‌ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. శాంతి భద్రతలు గవర్నర్‌ పరిధిలో ఉన్నా.. ఆయన ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని ప్రశ్నించారు. కాళ్లు పట్టుకుంటున్నాడని, జరుగుతున్న అరాచకాలపై కళ్లు మూసుకోవద్దని సూచించారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలపై కేసీఆర్‌ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, అవసరమైతే కాంగ్రెస్‌ నేతలను చంపేయడానికి కూడా వెనుకాడబోరని పేర్కొన్నారు. 

లెక్క బరాబర్‌ చేస్తం..
కాంగ్రెస్‌ నేతలను కేసులతో వేధించేందుకు కేసీఆర్‌ తన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను రాజధాని చుట్టు పక్కలా నియమించారని ఆరోపించారు. వీరంతా ఫోన్‌లు ట్యాపింగ్‌ చేయడం, పాత కేసులు తవ్వే పనిలో ఉన్నారు. అయితే వీరందరి పేర్లను డైరీలో రాస్తున్నం. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక లెక్క బరాబర్‌ చేస్తాం. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఐపీఎస్‌ల పైనా విచారణ చేయిస్తాం’అని స్పష్టం చేశారు. పోలీసులు కక్ష సాధింపు చర్యలు మానుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తనపైనా పాత కేసులు తవ్వుతున్నారని, ఆ కేసుల్లో దమ్ముంటే అరెస్ట్‌ చేయాలని సీఎంకు సవాల్‌ విసిరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement