న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి రాబోతున్నానని సంకేతాలు ఇవ్వడంతో ఆయనను ఆహ్వానిస్తూ తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. మొరాదాబాద్ వాద్రా స్వస్థలం కావడంతో స్థానిక మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారు. ‘మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా రాబర్ట్ వాద్రాజీనీ ఆహ్వానిస్తున్నాం’ అని వారు ఫ్లెక్సీల్లో రాశారు.
మనీలాండరింగ్ కేసు నుంచి విముక్తి పొందగానే ప్రజాసేవలో మరింత పెద్దపాత్ర పోషించాలని ఆశిస్తున్నట్టు వాద్రా ఆదివారం ఫేస్‌బుక్‌లో చేసిన ఓ పోస్టులో పేర్కొనడం పలువురిని ఆశ్చర్యపరించింది. ఆయన రాజకీయాల్లోకి రాబోత్తున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం.. చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడిన రాబర్ట్ వాద్రా.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మాట నిజమే కానీ, అందుకు తొందరేమీ లేదని వివరణ ఇచ్చారు. మొదట తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని రుజువు చేసుకోవాల్సిన అవసరముందని, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడంపై కృషి చేస్తానని చెప్పారు. మరోవైపు వాద్రా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. ప్రియాంక, రాహుల్ నడుపుతున్న సర్కస్.. జోకర్ కోసం ఎదురుచూస్తున్నదని, వాద్రా ఆ సర్కస్‌కు జోకర్ అని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఘాటుగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment