చంద్రబాబుది నాలికా... తాటి మట్టా? | Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu About Kia Motors | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తుగ్లక్‌గా ప్రజలే తీర్పిచ్చారు: సజ్జల

Published Thu, Feb 6 2020 5:34 PM | Last Updated on Thu, Feb 6 2020 5:45 PM

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu About Kia Motors - Sakshi

సాక్షి, తాడేపల్లి : ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించారన్నారు. రైతుల పేరుతో టీడీపీ కార్యకర్తలు హడావిడి చేస్తున్నారని,  రాజధాని ఏర్పాటు విషయంలో చంద్రబాబు అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారని ఆయన వ‍్యాఖ్యానించారు. ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఇదే రాజధాని అని నిర్ణయించేశారని మండిపడ్డారు. ఓ వర్గం మీడియా చంద్రబాబును మోస్తోందని ధ‍్వజమెత్తారు. (రాజధానితో చంద్రబాబు వ్యాపారం)

లోకేష్‌ను తిరస్కరించారు
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి  మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చంద్రబాబు కరుడుగట్టిన మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై లెక్కలేని తనంతో ఆయన వ్యవహార శైలి ఉంది. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదు. కేసులకు భయపడి రాత్రికి రాత్రే హైదరాబాద్‌ విడిచి పారిపోయి వచ్చేశారు. చgద్రబాబు తుగ్లక్‌గా ప్రజలే తీర్పు ఇచ్చారు. ప్రజల్లో నమ్మకం కల్పించుకుంటే ఆయనను ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు. ఏదో ఒక సాకుతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే లెక్కలేకుండా పోయింది. రాజధాని ఏర్పాటు విషయంలో కూడా చంద్రబాబు అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు చెప్పే క్యాపిటల్‌ ప్రాంతంలోనే లోకేష్‌ను ప్రజలు తిరస్కరించారు. 

ఎకరం రూ.15 కోట్లకు ఎందుకు కొనాలి?
రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం హక్కా...కాదా? ప్రభుత్వానికి హక్కు లేకపోతే చంద్రబాబు ఎలా నిర్ణయించారు? లక్షకోట్లు ఖర్చు చేస్తే తప్ప...మౌలిక వసతులు కల్పించలేం. వికేంద్రీకరణ ఎందుకు చేస్తున్నారో సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలనుకున్నారు. చట్టసభల రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని సీఎం చెప్పారు. న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధికి దోహదపడుతుంది. మూడు ప్రాంతాలకి సమన్యాయం చేయాలనే సీఎం ఆలోచన. వికేంద్రీకరణ వల్ల అమరావతి రైతులు నష్టపోకూడదనే కౌలును పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచారు. రైతు కూలీలకు కూడా రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచారు. బినామీల భూముల ధరలు పెంచేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఎకరం రూ.15 కోట్లకు ఎందుకు కొనాలో తెలియని పరిస్థితి.(‘కియా’పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు)

ఏం చేస్తామని చెప్పామో... చేసి చూపిస్తాం
చంద్రబాబుపై ఉద్యోగులకు నమ్మకం ఉంటే అమరావతిలో ఉద్యోగులు ఎందుకు నివాసం ఏర్పాటు చేసుకోలేదు. ఆయన కూడా అక‍్రమ కట్టడంలోనే నివాసం ఉంటున్నారు. చంద్రబాబుది నాలికా...తాటి మట్టా అర్థం కావడం లేదు. ఆయన మానసిక వైఫల్యంతో సీఎం జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబులాగా విజన్‌ పేరుతో కాలయాపన చేయడం లేదు. ఐదేళ్లలో మేం ఏం చేస్తామని చెప్పామో... చేసి చూపిస్తాం. ప్రజలు మాకు ఇచ్చిన తీర్పుతో మా మీద బాధ్యత పెరిగింది. చంద్రబాబు రాజకీయం కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రమంతటా ర్యాలీలు జరుగుతున్నాయి. ఎల్లో మీడియాకు మాత్రం కనిపించడం లేదు. భద్రత లేకుండా చంద్రబాబు వెళుతున్నారా? శాంతి భద్రతలను గౌరవించాలనే మేం పోటీ కార్యక్రమాలు చేయడం లేదు. 

అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. రాజధానిని అమరావతి నుంచి ఎక్కడికి తీసుకుపోవడం లేదు. ఒక రాజధాని అమరావతిలో మరొక రాజధాని విశాఖలో, మరొక రాజధాని కర్నూలులో ఉంటుంది. ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులకు బుద్ది రాలేదు. కళ్లు నెత్తికెక్కి టీడీపీ నాయకులు వ్యవహరించారు కాబట్టి ప్రజలు పక్కన పెట్టారు. చంద్రబాబుకు వయసు పెరిగిన బుద్ది పెరగలేదు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర పరిధిలోనిది. రాజధాని అనేది మార్చలేదు... మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. రాజధానికి భూముల ఇచ్చిన వారిలో 14 వేల మంది రైతులు కాదు. చంద్రబాబు అప్పు తెచ్చిన మూడు లక్షల కోట్లలో ఒక లక్ష కోట్లు పెట్టి రాజధాని కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.(కియాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : బుగ్గన)

పవన్‌ కల్యాణ్‌ లెటర్‌ హెడ్స్‌ కూడా టీడీపీ వద్దే ఉన్నట్లున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలుగానే పవన్‌ స్టేట్‌మెంట్స్‌ వస్తాయి. ఒకరోజు సీఎస్‌ సెలవులో వెళ్లిపోయారని... ఇంకోరోజు కియా తరలి వెళ్లిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సెలెక్ట్‌ కమిటీ లేదు.. దానికి మండలి ఆమోదం లేదు. సభలో తీర్మానం చేయకముందే విచక్షణాధికారాన్ని ఎలా ఉపయోగిస్తారు. కౌన్సిల్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు బతుకంతా మేనేజ్‌చేయడమే..
కియా పరిశ్రమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు బతుకు అంతా మీడియా మేనేజ్‌మెంట్‌నే. కియా ఎందుకు పక్క రాష్ట్రానికి తరలిపోతుంది. అసత్య ప్రచారం చేస్తే న్యాయపరంగా ముందుకు వెళతాం. ఎన్నార్సీ అనేది రాష్ట్రానికి అవసరం లేదు. ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వం. ఎన్నార్సీకి మేం వ్యతిరేకం. ముస్లింల క్షేమం మా లక్ష్యం. ముస్లిం బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరగనివ్వం’ అని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement