కరెంట్‌ చార్జీల పెంపు దీపావళి కానుకా?: వైఎస్‌ జగన్‌ | Andhra pradesh: Ys Jagan For Ap Govt Over Power Charges Hike | Sakshi
Sakshi News home page

కరెంట్‌ చార్జీల పెంపు దీపావళి కానుకా?: వైఎస్‌ జగన్‌

Published Mon, Oct 28 2024 4:47 AM | Last Updated on Mon, Oct 28 2024 10:04 AM

Andhra pradesh: Ys Jagan For Ap Govt Over Power Charges Hike

సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్‌ జగన్‌

విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పారు 

అవసరమైతే 35 శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారు 

ప్రజలపై అదనపు చార్జీలు వేయడమేనా మీ విజన్‌? 

5 నెలల్లోపే రూ.6,072.86 కోట్ల భారం మోపడం భావ్యమేనా? 

మాట తప్పడమే మీ నైజమని మరోసారి నిరూపించుకున్నారు 

ఇకనైనా అబద్ధాలు మానండి.. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేయకండి 

తక్షణమే చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి 

లేదంటే ప్రజలు క్షమించరు.. వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు

అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంత భారీ స్థాయిలో విద్యుత్‌ చార్జీలు పెంచి మాట తప్పడమే మీ (చంద్రబాబు) నైజమని మరోసారి రుజువు చేశారు. ఇకనైనా అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేయడం మానండి. విద్యుత్‌ చార్జీల భారం వేయాలన్న మీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే ప్రజలు క్షమించరు. వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు. – వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంటు చార్జీలు పెంచడమేనా..’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని, అవసరమైతే 30 శాతం తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైంది చంద్రబాబూ? అంటూ సూటిగా ప్రశ్నించారు.

‘టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్‌ చార్జీలు తగ్గించేవాళ్లం అని గతంలో చెప్పిన మీరు.. ఇప్పుడు ప్రజలు ఎంతగా వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా? ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ చార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియో­గదారులు చేసిన విజ్ఞప్తులను ఎందుకు పెడచెవిన పెట్టారు? ప్రజలపై అదనపు చార్జీల భారం వేయడమే మీ విజనా?’ అంటూ చంద్ర­బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

మీరు తప్పు చేసి మాపై నిందలా?
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐదు నెలల్లోపే వినియో­గదారులపై ఎఫ్‌పీసీసీఏ చార్జీల భారం రూ.6,072.86 కోట్లు మోపింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను సిగ్గు లేకుండా వదిలేసి ఎఫ్‌పీసీసీఏ చార్జీల పేరిట వసూలు చేస్తున్నప్పటికీ.. అవి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కార్యకలాపాలకు సంబంధించిన చార్జీలంటూ మా ప్రభుత్వంపై నిందలు మోపడానికి ప్రయత్నించడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వమే ఈ చార్జీలు భరించాలని, ప్రజలపై వేయడానికి వీల్లేదని ఏపీఈఆర్సీ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరారు. వారం రోజులపాటు ప్రభుత్వ స్పందన కోసం ఏపీఈఆర్సీ ఎదురు చూసినా కూటమి ప్రభుత్వం చార్జీలు భరించేందుకు ముందుకు రాలేదంటే అర్థం ఏమిటి? ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానానికి అర్థమేమిటి బాబూ?

ప్రజలపై చార్జీల భారం వేయా­లన్నదే మీ ఉద్దేశమని ఇక్కడ స్పష్టమైంది. గతంలోనూ ఇలా­గే చార్జీలు పెంచి, ఇదేమి న్యా­యం అని అడిగిన ప్రజలను బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించి.. తుపాకీలతో కా­ల్పిం­చి చంపించిన చరిత్ర మీదే. ఇప్పటికైనా విద్యుత్‌ చార్జీల భారం వేయాలన్న మీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే ప్రజలు క్షమించరు. వైఎస్సార్‌­సీపీ చూస్తూ ఊరుకోదు.

ఆ రోజే డిస్కంలను అప్పులపాలు చేశారు
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే విద్యుత్‌ రంగాన్ని నాశనం చేశారు. అనవసర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల కార­ణంగా డిస్కంలను అప్పుల­పాలు చేశారు. అవ­సరం లేకపో­యినా పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌(పీపీఏ)­లను అధిక ధర­లకు కుదుర్చు­కు­న్నారు. దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్‌ సంస్థలపై 25 ఏళ్లపాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తే రూ.140.10 బిల్లు వచ్చేది. 2018–19కి వచ్చే సరికి ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు రూ.197.60. అంటే 41.04 శాతం పెరిగింది. 2016–18లో 78 యూనిట్లకు రూ.145.30 నుంచి రూ.202.80 అంటే 39.57 శాతం, 80 యూనిట్లకు రూ.150.50 నుంచి రూ.208 అంటే రూ.38.21 శాతం పెంచేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, విద్యుత్‌ చార్జీల విషయంలో, విద్యుత్‌ రంగం విషయంలో ఇలాంటి కుట్రలే చేస్తుంటారని మరోసారి ప్రజలకు అర్థమయ్యేలా చేశారు.

2014–19లో చంద్రబాబు సీఎంగా ఉండగా.. విద్యుత్‌ శాఖను అసమర్థంగా నిర్వహించిన కారణంగా డిస్కంలకు సంచిత నష్టాలు రూ.22,089 కోట్లు వచ్చాయి. అప్పటికే ఉన్న రూ.6,625 కోట్ల నష్టాలతో కలుపుకుని మొత్తంగా రూ.28,715 కోట్లకు నష్టాలు పెరిగాయి. డిస్కంల సంచిత నష్టాలు 4.35 శాతం రెట్లు పెరిగాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్‌ రంగ సంస్థలపై అప్పులతోపాటు బకాయిల భారం 2014లో రూ.29,552 కోట్లు ఉండగా, అది 2019లో రూ.86,215 కోట్లకు చేరింది.

టీడీపీ ప్రభుత్వం కాలానుగుణంగా ట్రూ అప్‌ పిటిషన్లను ఏపీఈఆర్‌సీకి దాఖలు చేయాలి. కానీ అలా చేయలేదు. అందువల్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు టీడీపీ సర్కార్‌ హయాం నాటి ట్రూ అప్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. అయితే ఆ భారాన్ని విని­యో­గదారులపై పూర్తిగా మోపకుండా అతి తక్కువ భారం పడేలా చేసింది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ట్రూఅప్, ఎఫ్‌పీసీసీఏ తదితర కొత్త పేర్లతో ప్రజలపై భారం మోపి కష్టాల­పాలు చేస్తోందంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు నానా రాద్ధాంతం చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement