రామాయంపేట (మెదక్): తమను పట్టించుకోని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేటలో సంఘం జిల్లా అధ్యక్షుడు అమరసేనారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లా డారు. రెడ్డి కులస్తులు అన్ని రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారని ఆయన చెప్పారు. తమ కుల సంఘం అభ్యున్నతి విషయమై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1,000కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి కులస్తుల ఐక్యత, అభివృద్ధే ధ్యేయంగా అక్టోబర్ 2న వేములవాడ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు సంతోష్‌రెడ్డి తెలిపారు. 12న హైదరాబాద్‌లో యాత్ర ముగుస్తుందన్నారు. అనంతరం పాదయాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు. గతంలో బ్రాహ్మణులను, తాజాగా వైశ్య సంఘాలను విమర్శించిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే ఆయనను గ్రామాల్లో తిరగనివ్వ బోమని సంతోష్‌రెడ్డి హెచ్చరించారు.