Reddy Corporation
-
‘పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేసింది చంద్రబాబు మనుషులే’
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేయించింది చంద్రబాబు మనుషులేనని రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ల చైర్మన్లు స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ రెక్కీ నిర్వహించిందంటూ వచ్చిన వార్తలను రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ల చైర్మన్లు ఖండించారు. ‘ పవన్‌పై రెక్కీ చేసింది చంద్రబాబు మనుషులే. సోషల్ మీడియాలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. వంగవీటి రంగా హత్య వెనుక ఎవరున్నారో ప్రజలు ఆలోచించాలి. కోనసీమ, తిరుపతి ఘటనల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. అల్లర్ల వెనుక పవన్ కల్యాణ్ మనుషులే ఉన్నారు’ అని రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. విజయ్, ఆదిత్య చౌదరి, సాయికృష్ణ చౌదరి రెక్కీ నిర్వహించారు. రెక్కీ నిర్వహించిన వారు చంద్రబాబుతో ఫొటోలు దిగారు. కులాల కుంపట్లతో పవన్‌ను చంద్రబాబు బలి పశువును చేస్తున్నారు’ అని కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ తెలిపారు. ‘పవన్ సభకు జనసమీకరణం చేసింది టీడీపీ కాదా?, కుట్ర పూరిత రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్. రెడ్డి, కాపుల మధ్య గొడవలు పెట్టి చంద్రబాబు లబ్ది పొందాలని చూస్తున్నారు. జనం అన్నీ గమనిస్తూనే ఉన్నారు. చీఫ్ ట్రిక్స్ చేస్తే జనం పట్టించుకోరు. సీఎం జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచిస్తామే తప్ప కుట్రల గురించి కాదు. కాపు సామాజికవర్గం మీద కుట్ర జరుగుతుంది’ ’ అని కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. -
రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌గా సత్యనారాయణరెడ్డి బాధ్యతలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం తాడేపల్లి సీఎస్ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని అభినందనలు తెలియజేశారు. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 137 పోస్టుల్లో మహిళలకు 69, పురుషులకు 68 పదవులు ఇచ్చారు. -
‘రెడ్డి నేతలను అణచివేసేందుకు కుట్రలు’
సాక్షి, హైదరాబాద్: రెడ్డి సామాజిక వర్గ నేతలను అణచి వేసేందుకు రాజకీయ పార్టీలన్నీ కుట్రలు పన్నుతున్నాయని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ..రెడ్డి వర్గానికి చెందిన నేతలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారనే కోపంతో పార్టీలు అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాయని తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, ప్రతాప్రెడ్డిలపై కేసులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఐటీ దాడులు జరిగాయని కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఇప్పటివరకు టికెట్ హామీ లభించకపోవడం శోచనీయమన్నారు. మహాకూటమి అధ్యక్షుడిగా, సీఎం అభ్యర్థిగా రెడ్డి నేతను ప్రకటించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఓసీ సమస్యలను అన్ని పార్టీలు తమ ఎన్నిక ప్రణాళికలో చేర్చి ప్రధాన ఎజెండాగా పరిగణించడం హర్షణీయమని ఆయన తెలిపారు. -
రెడ్ల సమస్యలు నెరవేరుస్తారా.. లేదా?
హైదరాబాద్: రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు నెరవేరుస్తారా.. లేదా? అనేది సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభలోనైనా స్పష్టత ఇవ్వాలని రెడ్డి జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం సికింద్రాబాద్‌లోని రాయల్ రివే హోటల్లో రాష్ట్ర స్థాయి రెడ్డి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ కో చైర్మన్లు జైపాల్‌రెడ్డి, పైళ్ల హరినాథ్‌రెడ్డి, వసంతరెడ్డి, అసోసియేట్ చైర్మన్ రాంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్, విద్యార్థులకు ప్రత్యేక గురుకులాలు, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే రెడ్డి విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకం వర్తింపజేసి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. రెడ్డి భవన్‌కు 100 ఎకరాలు, సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. -
‘రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి’
హైదరాబాద్: తెలంగాణలో పేద రెడ్ల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయా లని డిమాండ్ చేస్తూ తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం సచివాలయం ముట్టడి చేపట్టారు. తమ సమస్యల్ని పరిష్కరించా లని 2015 నుంచి సభలు, సమావేశాలు, పాద యాత్రలు వంటి అనేక రూపాల్లో తమ గళాన్ని విన్పిస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక సహాధ్యక్షుడు భూంపల్లి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంది తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మే 27న రెడ్ల సమరభేరి
సాక్షి, హైదరాబాద్: రెడ్డి కులస్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్న డిమాండ్‌తో మే 27న 10 లక్షల మంది రెడ్లతో సమరభేరి నిర్వహించనున్నట్లు రెడ్డి జేఏసీ చైర్మన్ నవల్గ సత్యనారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో గౌరెల్లి, ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్–10 వద్ద ఈ సభ నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం 500 మంది రెడ్లతో బహిరంగ సభ నిర్వహించే స్థలంలో భూమిపూజ చేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, రెడ్ల కోసం ప్రత్యేక గురుకులాలు, స్టడీ సర్కిళ్లు, పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్, రైతు సంక్షేమం, ఆరోగ్య పథకాల సమాన వర్తింపు, స్వయం ఉపాధి, సహకార రంగాల్లో ప్రభుత్వ చేయూత తదితర పది ప్రధాన డిమాండ్ల సాధన కోసం సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. -
మమ్మల్ని పట్టించుకోకపోతే పాతరేస్తాం
రామాయంపేట (మెదక్): తమను పట్టించుకోని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేటలో సంఘం జిల్లా అధ్యక్షుడు అమరసేనారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లా డారు. రెడ్డి కులస్తులు అన్ని రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారని ఆయన చెప్పారు. తమ కుల సంఘం అభ్యున్నతి విషయమై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1,000కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి కులస్తుల ఐక్యత, అభివృద్ధే ధ్యేయంగా అక్టోబర్ 2న వేములవాడ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు సంతోష్‌రెడ్డి తెలిపారు. 12న హైదరాబాద్‌లో యాత్ర ముగుస్తుందన్నారు. అనంతరం పాదయాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు. గతంలో బ్రాహ్మణులను, తాజాగా వైశ్య సంఘాలను విమర్శించిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే ఆయనను గ్రామాల్లో తిరగనివ్వ బోమని సంతోష్‌రెడ్డి హెచ్చరించారు. -
రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి
- జాతీయ రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి - త్వరలో పలు నగరాల్లో రెడ్డి మినీ గర్జన సభలు హైదరాబాద్: నిరుపేద రెడ్డి సామాజిక అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్లతో జాతీయ స్థాయిలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షుడు జి. కరుణాకర్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆదివారం రెడ్డి సంఘం ప్రతినిధులతో కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజాప్రతినిధుల మద్దతు లేకుండా రెడ్డి మహాగర్జన నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మహబూబ్‌నగర్, వరంగల్, విశాఖపట్నం, కర్నూలు తదితర నగరాలలో త్వరలో రెడ్డి మినీ గర్జనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుపేద రెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం తక్షణమే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే రెడ్డి పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల సహకారంతో తామే రూ.2 వేల కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. అధిక శాతం రెడ్డి వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ వర్గానికి చెందిన సమస్యలపై ఏనాడూ పెదవి విప్పి మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. రిజర్వేషన్ల పెంపు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో బీరం ఇందిరారెడ్డి, పటోళ్ళ నాగిరెడ్డి, ఎస్.కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.