రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి
- జాతీయ రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి
- త్వరలో పలు నగరాల్లో రెడ్డి మినీ గర్జన సభలు
హైదరాబాద్: నిరుపేద రెడ్డి సామాజిక అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్లతో జాతీయ స్థాయిలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షుడు జి. కరుణాకర్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆదివారం రెడ్డి సంఘం ప్రతినిధులతో కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజాప్రతినిధుల మద్దతు లేకుండా రెడ్డి మహాగర్జన నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మహబూబ్‌నగర్, వరంగల్, విశాఖపట్నం, కర్నూలు తదితర నగరాలలో త్వరలో రెడ్డి మినీ గర్జనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నిరుపేద రెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం తక్షణమే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే రెడ్డి పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల సహకారంతో తామే రూ.2 వేల కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. అధిక శాతం రెడ్డి వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ వర్గానికి చెందిన సమస్యలపై ఏనాడూ పెదవి విప్పి మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. రిజర్వేషన్ల పెంపు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో బీరం ఇందిరారెడ్డి, పటోళ్ళ నాగిరెడ్డి, ఎస్.కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.