ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లాలోని అధికార పార్టీలో అంతర్గత పోరు అధికమవుతోంది. నేతల మధ్య వైరం తారస్థాయికి చేరుతోంది. సీట్ల కోసం సిగపట్లు తప్పేలా కనిపించడం లేదు. ఏ నియోజవర్గంలో ఎవరు పోటీలో నిలుస్తారోనన్న స్పష్టత లేకపోవడం.. సిటింగ్‌ల మార్పుపై జరుగుతున్న ప్రచారం టీడీపీ నేతల మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోస్తోంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలోని మర్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో సిటింగ్‌ల మార్పు వ్యవహారం జిల్లా టీడీపీలో వర్గ విబేధాలను పతాక స్థాయికి చేర్చింది. తాజా పరిణామాలు సిటింగ్‌ల మార్పు ప్రచారానికి మరింత బలం చేకూరింది. చంద్రబాబు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తానంటూ టీటీడీ బోర్డు సభ్యుడు ఇన్ఫోటెక్‌కు చెందిన బోధనపు అశోక్‌రెడ్డి మంగళవారం మార్కాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అశోక్‌రెడ్డి మార్కాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని, ఈ మేరకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందన్న ప్రచారం ఉంది. ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కందుల నారాయణరెడ్డిని ఒప్పించి అశోక్‌రెడ్డిని రాబోయే ఎన్నికల బరిలో నిలిపేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. కొంత కాలంగా ఈ ప్రచారం ఉన్నా అశోక్‌రెడ్డి పూర్తి స్థాయిలో బయట పడలేదు.
మంగళవారం మార్కాపురం వచ్చిన అశోక్‌రెడ్డి చంద్రబాబు ఆదేశిస్తే తాను పోటీ చేస్తానంటూ ప్రకటించి నుంచి తెరపైకి వచ్చారు. అశోక్‌రెడ్డి కందుల నారాయణరెడ్డి వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇమ్మడి కాశీనా«థ్ ఇంట్లోనే విలేకరుల సమావేశం పెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి దొనకొండ జడ్పీటీసీ డాక్టర్ మన్నే రవీంద్ర, తర్లుపాడు మాజీ సర్పంచ్ కందుల కళావతి వర్గంతో పాటు మరి కొందరు ఎంపీటీసీలు, ముఖ్యనేతలు హాజరు కావడం గమనార్హం. ఎట్టకేలకు ఇన్ఫోటెక్ అశోక్‌రెడ్డి మార్కాపురంలో బరిలో తానున్నాంటూ ప్రకటించి ఆ పార్టీలో మరింత ఆజ్యం పోశారు. జరుగుతున్న తంతు చూస్తే కందులను తప్పించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కందుల వర్గం దీన్ని ఖండిస్తోంది. ఒక వేళ నారాయణరెడ్డిని కాదని ఇన్ఫోటెక్ అశోక్‌రెడ్డిని అభ్యర్థిగా నిలిపే పక్షంలో తాము వారికి మద్దతు ఇచ్చేది లేదని ఆయన వర్గం తేల్చి చెబుతోంది. కాదు కూడదని చంద్రబాబు అశోక్‌రెడ్డిని బరిలో నిలిపితే తాము పార్టీని వీడేందుకు సిద్దమని వారు తేల్చి చెబుతున్నారు. మొత్తంగా ఇన్ఫోటెక్ అశోక్‌రెడ్డి అభ్యర్థిత్వం తెరపైకి రావడంతో మార్కాపురం టీడీపీలో గొడవలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి.
కనిగిరి బరిలో నిలిచేదెవరో..
కనిగిరిలో సిటింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును తప్పించి, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. చాలా కాలంగా ఈ ప్రచారం నడుస్తోంది. కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు యాదవ, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన కదిరి బాబూరావును పక్కన పెట్టి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలిపితే ఆ సామాజిక వర్గం ఓట్లు చీల్చవచ్చని టీడీపీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డిని కనిగిరి బరిలో నిలపాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం ఉగ్ర నర్సింహారెడ్డిని టీడీపీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఉగ్రను టీడీపీ అభ్యర్థిగా నిలిపేందుకు సిటింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ససేమిరా అంటున్నాడు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణతో కదిరి బాబురావుకు సన్నిí ßæత సంబంధాలు ఉన్నాయి. దీన్ని అడ్డుపెట్టి రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ టిక్కెట్ గెలుచుకుంటానని కదిరి ధీమాతో ఉన్నాడు. అలా కాకుండా చంద్రబాబు ఉగ్ర నర్సింహారెడ్డికి టిక్కెట్ ఇస్తే ఆ పార్టీలో వర్గ విభేధాలు రోడ్డున పడనున్నాయి.
ఎస్‌ఎన్‌పాడు తేలేదెప్పుడు?
సంతనూతలపాడు నియోజకవర్గంలోనూ రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి మార్పు ఉంటుందని అధికార పార్టీ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను తప్పించి కొత్త అభ్యర్థిని బరిలో నిలుపుతామని ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన కొందరు స్థానిక టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజును సంతనూతలపాడు నుంచి పోటీ చేయించేందుకు ఆ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విజయ్‌కుమార్‌ను తప్పించాలంటూ అసమ్మతి వర్గం పలుమార్లు ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేష్‌ను కలిసి విన్నవించింది. సంతనూతలపాడు నుంచి విజయ్‌కుమార్‌ను తప్పించే పక్షంలో ఆయన వర్గం టీడీపీకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇక్కడ టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదు.
వై.పాలెంలో అభ్యర్థి కరువు..
యర్రగొండపాలెం నుంచి రాబోయే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలో నిలిపేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే డేవిడ్ రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన అధికార పార్టీలోకి ఫిరాయించారు. దీంతో ఆ నియోజకవర్గంలో డేవిడ్ రాజుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్సార్ సీపీకి కంచుకోటగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఫార్టీ ఫిరాయించిన డేవిడ్‌రాజును ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే ప్రజలు ఛీత్కరించే అవకాశం ఉంది. దీన్ని నుంచి బయటపడేందుకు టీడీపీ ఇక్కడి నుంచి కొత్త అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సూచన మేరకే ఇక్కడ అభ్యర్థి నియామకం ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. కొత్త అభ్యర్థిని నిలిపితే అతడి విజయానికి టీడీపీ పాత వర్గంతో పాటు డేవిడ్ రాజు వర్గం కూడా కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా పై నాలుగు సీట్లలో సిటింగ్‌ల మార్పు వ్యవహారం ఆపార్టీలో వర్గ విభేధాలను పతాక స్థాయికి చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment