జనచైతన్యం కోసం ఓ అశోకుడి అలుపెరుగని కృషి! | Senior Citizen Establishes Party and Contest in Elections | Sakshi
Sakshi News home page

Nov 29 2018 9:20 PM | Updated on Nov 30 2018 10:18 AM

Senior Citizen Establishes Party and Contest in Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరైన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? హాయిగా కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లతో హాయిగా కాలం వెళ్లదీస్తూ.. జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటారు. కానీ 68 ఏళ్ల అశోక్‌కుమార్‌ మునికుంట్ల అలా ఆలోచించలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ అకౌంట్స్‌ (సీజీడీఏ)లో ఉద్యోగిగా పనిచేసి 2010లో పదవీ విరమణ పొందిన ఆయన.. హాయిగా ఇంట్లో కూచొని కాలక్షేపం చేస్తే సరిపోతుందనుకోలేదు. సమాజానికి తనవంతు సేవ చేయాలని తపించారు. సీనియర్‌ సిటిజెన్‌ అయినప్పటికీ.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నగరంలో ఎక్కడ తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలు జరిగినా.. అక్కడ కెమెరాతో వాలిపోయేవారు. ఉద్యమ ఘట్టాలను తన కెమెరాలో బంధించి.. సోషల్‌ మీడియాలో పంచుకునేవారు. తెలంగాణ ఉద్యమంలో ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమకారుడిగా చురుగ్గా పాల్గొన్న అశోక్‌.. రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ప్రజల ఆకాంక్షల సాకారం దిశగా దృష్టి సారించారు. తెలంగాణలో 50శాతానికిపైగా బడుగు, బహుజన వర్గాల ప్రజలు ఉన్నారు. అయినా, వారికి రాజకీయ అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.



జనాభాలో అతి తక్కువగా ఉన్న కొన్ని వర్గాల వారే రాజకీయాధికారాన్ని అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు ప్రభుత్వంలో, రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఆయనను ఆలోచింపజేసింది. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఆయనే సొంతంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించారు. బహుజన రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పేరిట పార్టీని నెలకొల్పి.. ప్రస్తుత ఎన్నికల్లో 10మంది అభ్యర్థులను బరిలో నిలిపారు. బహుజన రాజకీయ స్పృహను మరింత పెంచేందుకు, బీసీలు, ఎంబీసీలు, ఎస్సీ, ఎస్టీల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు తాను పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే అశోక్‌కుమార్‌ మునికుంట్ల స్వయంగా సనత్‌నగర్‌ నియోజకవర్గంలో పోటీకి దిగారు.

ప్రస్తుతం ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న ఆయన.. ప్రస్తుత ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్‌ ఇవ్వడంలో తీవ్ర అన్యాయం చేశాయని, జనాభా దామాషా ప్రకారం బహుజన వర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా వివక్షకు గురి చేశాయని అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంలో మమేకమైనప్పుడే వారి సమస్యల పరిష్కారం సులువు అవుతుందని, అమరులు ఆకాంక్షించిన నిజమైన తెలంగాణ సాకారమవుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న వారిలో ఇద్దరు బీసీ, ఒకరు ఎస్సీ, ఒకరు క్రిష్టియన్‌, ఐదుగురు ఎంబీసీలు ఉన్నారు. బహుజన రాష్ట్ర సమతి (బీఆర్‌ఎస్‌) పార్టీని ఎన్నికల సంఘం గుర్తించి.. పడవ గుర్తును కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement