అసెంబ్లీలో మాట్లాడుతున్న బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు
సాక్షి,బొబ్బిలి(విజయనగరం) : ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా అందరూ అంటున్నారనీ, అయితే.. ఆ జిల్లాలు వెనుకబడలేదని, వెనుకబెట్టి ఉంచబడ్డాయని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అసెంబ్లీలో అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని సాగునీటి వనరుల స్థితిగతులను సభ కళ్లకు కట్టారు. తోటపల్లి మేజర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం మినహా దాదాపు 90 శాతం నిధులను దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకున్నారన్నారు.
చివర్లో పది శాతం పనులను సైతం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో చేయించలేకపోయారన్నారు. కాలువలకు లైనింగ్, అవసరమైన చోట స్లూయీస్‌లు లేవన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మండలాలు గతేడాది కరువు కోరల్లో చిక్కుకున్నా ఎలాంటి ఆర్థిక సహాయం లేదన్నారు. జిల్లాలో 900కు పైగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మరమ్మతులతో ఉన్నాయన్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి, జలవనరుల శాఖా మంత్రి చొరవచూపి తోటపల్లి పనులతో పాటు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను బాగుచేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు.
జంఝావతి వివాదాన్ని ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని వీఆర్‌ఎస్, మడ్డు వలస, పెద్దగెడ్డ తదితర ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందేలా చూడాలన్నారు. అసెంబ్లీలో శంబంగి ప్రసంగం విన్న జిల్లా వాసులు సంబరపడ్డారు. ఇన్నాళ్లకు మన కష్టాలను అసెంబ్లీలో వినిపించే నాయకుడు దొరికాడని హర్షం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment