చంద్రగిరిపై టీడీపీకి చుక్కెదురు | Shock To TDP In Chandragiri | Sakshi
Sakshi News home page

చంద్రగిరిపై టీడీపీకి చుక్కెదురు

Published Sun, May 19 2019 3:45 AM | Last Updated on Sun, May 19 2019 4:59 AM

Shock To TDP In Chandragiri - Sakshi

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించటాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీకి హైకోర్టులో చుక్కెదురైంది. రీ పోలింగ్‌ను సవాల్‌ చేస్తూ టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఐదు కేంద్రాల్లో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది. ఇదే సమయంలో మూడు కేంద్రాల్లో రీ పోలింగ్‌ కోరుతూ టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని ఇచ్చిన వినతిపత్రంపై ఈసీ స్పందిస్తూ రెండు చోట్ల రీ పోలింగ్‌కు ఆదేశించిన నేపథ్యంలో నాని దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ అవసరం లేదని పేర్కొంటూ దీన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ శ్యాంప్రసాద్, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రగిరిలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయన్న ఎన్నికల సంఘం వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఆదేశించటాన్ని సవాలు చేస్తూ టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్‌ శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేయడం తెలిసిందే. దీనికి సంబంధించి టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులవర్తి నాని దాఖలు చేసిన వ్యాజ్యంపై కూడా జస్టిస్‌ శ్యాంప్రసాద్‌ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం మరోసారి విచారణ జరిపింది.

రిగ్గింగ్‌కు తిరుగులేని ఆధారాలు.. అందుకే రీ పోలింగ్‌
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయనేందుకు తమ వద్ద నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీ, వీడియో తదితరాలు ఉన్నాయని వివరించారు. పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ జరిగిందనేందుకు తిరుగులేని ఆధారాలున్న నేపథ్యంలో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు ఈవీఎంలను తమ ఆధీనంలోకి తీసుకుని ఇష్టానుసారంగా ఓట్లు వేసుకున్నారని, ఇందుకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కూడా సహకరించారని తెలిపారు. కోర్టు అనుమతినిస్తే ఆ వీడియోను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని, అన్ని వివరాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయని నివేదించారు. దీనిపై పులవర్తి నాని తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు అభ్యంతరం తెలిపారు. ఆ వీడియో ఏ పోలింగ్‌ కేంద్రంలోదో  తెలిసే అవకాశం లేదన్నారు. వీడియో ప్రదర్శన వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. 

ఆ అధికారులపై క్రమశిక్షణా చర్యలు 
అనంతరం అవినాశ్‌ తిరిగి వాదనలను కొనసాగిస్తూ పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. వారితో కుమ్మక్కైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని, పూర్తిస్థాయి విచారణ కూడా నిర్వహిస్తామని చెప్పారు. 1999లో తెలుగుదేశం పార్టీ వర్సెస్‌ ఎన్నికల సంఘం కేసులో ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని, వాటిపై ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయం ఉందంటూ హైకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు.

ఎన్నికల సంఘానికి సర్వాధికారాలున్నాయి...
పోలింగ్, రీ పోలింగ్‌ విషయంలో ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ ఏడు చోట్ల రీ పోలింగ్‌ కోరిందని, అయితే ఆధారాలను బట్టి ఐదు చోట్లే రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశించిందని చెప్పారు. 

శివప్రసాద్‌ పిటిషన్‌ కొట్టివేత..
అంతకు ముందు శివప్రసాద్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ రిటర్నింగ్‌ అధికారి నివేదిక లేకుండా రీ పోలింగ్‌ నిర్వహించడం సరికాదన్నారు. ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోడానికి వీల్లేదని, రీ పోలింగ్‌ విషయంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల సంఘం వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ శివప్రసాద్‌ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయించిన ప్రకారం ఆదివారం చంద్రగిరిలో రీ పోలింగ్‌ యథాతథంగా జరగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement