సిద్దరామయ్య (ఫైల్‌ఫోటో)
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. సొంత పార్టీ నేతల నుంచే ఆయన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష నేతగా మారాలని చూస్తున్న సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీలోని నేతలే అడ్డుతగులుతూ వస్తున్నారు. గడిచిన రెండు నెలలుగా ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోలేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని అంతర్గత కుమ్ములాటల కారణంగా ఎవరిని ప్రతిపక్ష నేతగా నియమించాలనే విషయంపై తర్జనభర్జన పడుతోంది. కాగా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా మారాలని చూస్తున్న సిద్ధరామయ్య ఆశలు అడియాసలయ్యేలా కనిపిస్తున్నాయి.
తయారైన సిద్ధరామయ్య వ్యతిరేక వర్గం..
గురువారం జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలోనూ సీనియర్ పార్టీ నాయకులు బహిరంగంగా సిద్ధరామయ్యపై అసం తృప్తి వ్యక్తం చేశారు. సిద్ధరామయ్యకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వవద్దని ఢిల్లీ స్థాయిలో కూడా ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పారీ్టలో సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఒక వర్గం తయారైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష నేతగా ఉన్న సిద్ధరామయ్యకు ప్రతిపక్ష నేత అవ్వాలని చాలా రోజులుగా చూస్తున్నారు. ఇటీవ ల జేడీఎస్–కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వ పతనానికి కారకులైన అసంతృప్త ఎమ్మెల్యేల్లో చాలా మంది సిద్ధరామయ్య మద్దతుదారులే కావడం గమనార్హం. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానం పెద్దల కోపానికి కారణమయింది.
ప్రభుత్వాన్ని కాపాడలేకపోయారు..
దేశ వ్యాప్తంగా అధికారం కోల్పోయి చతికిల పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఒక్క కర్ణాటకలో మాత్రం ప్రభుత్వంలో కొనసాగుతుండడంతో ఊపిరి పీల్చుకుంది. కానీ కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేల వల్ల అధికారం నుంచి ఇక్కడ కూడా అధికారం నుంచి దూరం కావాల్సి వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ వంటి నేతలు చాలా విధాలుగా కసరత్తులు చేస్తుంటే ఎంతో రాజకీయ అనుభవం ఉన్న పరమేశ్వర్, సిద్ధరామయ్యలు మాత్రం ఆ దిశగా సరిగా కృషి చేయలేదని ఆరోపణలు వినిపించాయి.
సిద్ధరామయ్యను లైట్ తీసుకున్న అధిష్టానం..
ఇక బీజేపీ అధికారంలోకి వచి్చన తర్వాత ప్రతిపక్ష నేతగా వెలుగొందుదామని చూస్తున్న సిద్దరామయ్య ఆశలపై సొంత పార్టీ నేతలు నెమ్మదిగా నీళ్లు చల్లుతున్నారు. రెండు నెలల నుంచి ప్రతిపక్ష నేత ఎవరనేది ప్రకటించకుండా అధిష్టానం కూడా నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. ఇటీవల సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లి మూడు రోజులు ఉన్నప్పటికీ సిద్ధరామయ్యకు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఏకే ఆంటోని, కేసీ వేణుగోపాల్, అహ్మద్ పటేల్ వంటి తదితర కొందరు నాయకులను కలసి తిరిగి వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను సీరియస్‌గా తీసుకోలేదని గుర్తించిన సిద్ధరామయ్య ప్రతి రోజూ కేపీసీసీ కార్యాలయానికి వచ్చి సందడి చేయడం ప్రారంభించారు. ఒక్కరే సమావేశాన్ని ఏర్పాటు చేసి వెళుతున్నారు. ఇది కూడా వివాదానికి తావు లేచింది. మీడియా సమావేశానికి కాంగ్రెస్ పారీ్టలోని ఎవరినీ ఆహ్వానించకుండా ఒక్కరే వచ్చి వెళుతుండడం, కేవలం తన మద్దతుదారులే మీడియా సమావేశంలో పాల్గొనడం పలు అభ్యంతరాలకు కారణమైంది.
డీకేకు ప్రతిపక్ష నేత పదవి!!
సిద్ధరామయ్య వ్యవహార శైలితో విసిగిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వవద్దని పట్టుపడుతున్నారు. విపక్ష నాయకుడిగా హెచ్‌కే పాటిల్, కృష్ణభైరేగౌడ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పరమేశ్వర్, రమేశ్ కుమార్ కూడా ప్రతిపక్ష నేత పోటీలో ఉన్నారు. కానీ హైకమాండ్ నుంచి వీరి పేర్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్న డీకే శివకుమార్ బెయిల్‌పైనే హైకమాండ్ దృష్టి సారించింది. ఒకవేళ డీకే శివకుమార్‌కు బెయిల్ లభించి బయటకు వస్తే, ఆయనను ఒప్పించి ప్రతిపక్ష నేతగా ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment