సాక్షి, బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వానికి నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడు సిద్దరామయ్య నేతృత్వంలో మంగళవారం కీలకమైన కర్ణాకట కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెబెల్ ఎమ్మెల్యేలతోపాటు పెద్దసంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం గమనార్హం. కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, అంజలి నింబల్కర్, ఎస్ రామప్ప, రోషన్ బేగ్ హాజరుకాలేదు. ఇప్పటికే కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 14మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తాము రాలేకపోతున్నామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజు, టీడీ రాజేగౌడ, సుధాకర్, కనీజ్ ఫాతిమా, ఈ తుకారాం పార్టీ అధిష్టానం నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉన్నారు.
మరోవైపు సీఎల్పీ భేటీ అనంతరం సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భైఠాయించి నిరసనకు దిగారు. బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ.. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని సిద్దరామయ్య ఈ సందర్భంగా ఆరోపించారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గతంలో ఐదుసార్లు ప్రయత్నించిందన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోందని, డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తోందని విరుచుకుపడ్డారు.
అమస్మతి ఎమ్మెల్యేలకు సిద్దూ వార్నింగ్
అసమ్మతి ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టం ప్రయోగించి.. సెక్షన్ 164-1 కింద వారిపై అనర్హత వేటు వేయాలని సిద్దూ స్పీకర్‌ను కోరారు. ఇప్పటికైనా రెబెల్ ఎమ్మెల్యేలు దిగిరావాలని, లేకపోతే వారిపై అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారందరిపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరుతున్నట్టు తెలిపారు. రెబెల్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని, అందుకే వారిపై అనర్హత వేసి.. ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment