
సాక్షి, అమరావతి : టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌పై టీడీపీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని బీజేపీ నేత సోము వీర్రాజు సూచించారు. చంద్రబాబు నాయుడు లోపల ఒకటి.. బయట మరొకటి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు శనివారమిక్కడ మాట్లాడుతూ...‘పోలవరం టెండర్లలో లోపాలను సవరించాలని అడగటం తప్పా?. టెండర్లలో లోపాలుంటే సరిదిద్దొద్దా? సీనియర్‌ని అని చెప్పుకునే చంద్రబాబు కేంద్రాన్ని నిందించడం సరికాదు. కేంద్రంసహాకరించకపోతే 60 శాతం పనులెలా పూర్తవుతాయి. జేసీ దివాకర్ రెడ్డిలాంటి నేతలను చంద్రబాబు అదుపులో పెట్టాలి. తమిళనాడులో శశికళ వద్ద ప్రజల సొమ్ము ఉంది కాబట్టే ఐటీ దాడులు చేశారు. అవినీతిని కేంద్రం చూస్తూ ఊరుకోవాలా?.’ అని సూటిగా ప్రశ్నించారు.
అలాగే పోలవరంపై అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తప్పుబట్టారు. నవంబర్ 16న 1395 కోట్లకు టెండర్ల నోటీసు ఇచ్చి... ఆ తర్వాత 1483 కోట్లకు ఎందుకు పెంచారని అన్నారు. 14 రోజుల్లోనే 88కోట్లు పెరగడంపై మాత్రమే లేఖలో ప్రశ్నించారన్నారు. పోలవరంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని... ప్రాజెక్టును ఆపమని ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment