చిరు బతుకుల్లో..వెలుగు దివ్వె | Street Food Vendors Happy With YS Jagan Promises In YSR Kadapa | Sakshi
Sakshi News home page

చిరు బతుకుల్లో..వెలుగు దివ్వె

Published Mon, Apr 1 2019 11:04 AM | Last Updated on Mon, Apr 1 2019 11:04 AM

Street Food Vendors Happy With YS Jagan Promises In YSR Kadapa - Sakshi

కనీస సౌకర్యాల కల్పన ఏదీ?
జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందులలో చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. వీధి వ్యాపారులను ఆదుకుంటామని మున్సిపల్‌ అధికారులు చెప్పినా.. కార్యరూపం దాల్చలేదు. ఎండా, వానను లెక్క చేయకుండా జీవనోపాధి కోసం వీధి పక్కన క్రయవిక్రయాలు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటున్న వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారుల బతుకులను రోడ్డు పాలు చేసిన వారే తప్ప.. వారికి ఆపన్న హస్తం అందించే వారు మాత్రం ఇన్నాళ్లూ కనిపించలేదు.

కానీ వారి జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరించే హామీలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. ఇందులో పొందుపరిచిన హామీలు వారిలో ఆత్మస్థైర్యం నింపింది. వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించి.. ఏటా సున్నా వడ్డీకే రూ.10 వేలు రుణం అందిస్తామన్న జగనన్న హామీ.. వారిలో ఆనందాన్ని నింపింది.

వీధి వ్యాపారులపై నిర్లక్ష్యమేల?
రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆధారంగా చేసుకొని వ్యాపారులు సాగించే వీధివ్యాపారుల పరిరక్షణ, సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని 2009లోనే  సుప్రీంకోర్టు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారుల సంరక్షణకు, వారి అభివృద్ధి కోసం పార్లమెంటు చట్టం తెచ్చింది. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించడంతో పాటు గుర్తింపు కార్డులు జారీ చేసి.. స్వేచ్ఛగా వ్యాపారం కొనసాగించేందుకు వీలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని బేఖాతరు చేస్తూ వీధి వ్యాపారుల సంక్షేమాన్ని విస్మరించింది. వీధి వ్యాపారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. సంక్షేమం కోసం బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందిస్తే.. వడ్డీ వ్యాపారుల బారి నుంచి విముక్తి పొందవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించినా తూతూ మంత్రంగా  చర్యలున్నాయే తప్ప కనీసం పట్టించుకునే నాథుడే లేరు. 

ప్రత్యేక జోన్‌ ఏదీ?
కడప నగరపాలక సంస్థలో వీధి వ్యాపారులకు ఇంత వరకూ ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేయలేదు. ప్రొద్దుటూరులో మడూరు కాలువ గట్టున ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేస్తామని అధికారులు గతంలో చెప్పినా కార్యరూపం దాల్చలేదు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ వీరికి ప్రత్యేక జోన్‌ లేదు. దీంతో రోడ్లపై వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులకు పోలీసుల బెడద తప్పడం లేదు. ఒక వేళ మార్కెట్‌ పరిసర ప్రాంతంలో వ్యాపారాలు చేసుకున్నా రుసుం చెల్లించాలంటూ కాంట్రాక్టర్‌లు బెదిరిస్తున్నారు. దీంతో వారి వ్యాపారం దినదిన గండంలా మారింది.  

గుర్తింపు కార్డులు ఇవ్వడంలో అలసత్వం
వీధి వ్యాపారుల చట్టం–2014 ప్రకారం దేశంలోని 2430 పట్టణాల్లో 18 లక్షల మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2344 వీధి వ్యాపారుల కమిటీలు ఏర్పాటు చేయడంతోపాటు 9 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చింది. జిల్లాలో 25 వేల మంది వ్యాపారులు ఉన్నారు. వారిలో కొందరికి గుర్తింపు కార్డులు అందించారు. తర్వాత ఈ ప్రక్రియను నిలిపివేశారు. వీధి వ్యాపారుల చట్టం అమల్లో మన పక్క రాష్ట్రమైన తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా, మన రాష్ట్రానికి మాత్రం టాప్‌–10లో చోటు లేదంటే .. ఇక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే కార్డు జారీ చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు చేసింది. వీధి వ్యాపారుల్లో చాలా వరకు ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. ఒక్కరికి మాత్రమే ఐడీ కార్డు జారీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.  

బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు

చిరు వ్యాపారులను నమ్మి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి  పరిస్థితుల్లో వడ్డీ లేకుండా ఏటా రూ.10 వేలు ఇస్తానని వైఎస్‌ జగన్‌ ప్రకటించడం మా లాంటి వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. మాకు మంచి చేయాలని చూస్తున్న జగన్‌కు అంతా మంచే జరుగుతుంది.– శ్రీనివాసులు, వ్యాపారి, ప్రొద్దుటూరు 

కొండంత ధైర్యం

చిరు వ్యాపారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కనీసం వారికి గుర్తింపు కార్డులు అయినా ఇచ్చి ఉంటే బ్యాంకు రుణాలు తీసుకునే వారు. సున్నా వడ్డీకే ఏటా రూ.10 వేలు ఇస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం చిరువ్యాపారులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్లయింది.  – సుభాష్‌బాబు, ప్రొద్దుటూరు

బీసీ డిక్లరేషన్‌తో అన్ని వర్గాలకు మేలు

వైఎస్‌ జగన్‌ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ వల్ల అన్ని వర్గాల వారికీ న్యాయం జరుగుతుంది. తోపుడు బండ్లు, వీధి వ్యాపారులకు ప్రాధాన్యం కల్పిస్తూ.. వారి జీవితాల్లో వెలుగును నింపేందుకు వైఎస్‌ జగన్‌ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ చాలా బాగుంది. లక్షలాది కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.  – నాగేంద్ర, టీచర్స్‌ కాలనీ, ప్రొద్దుటూరు 

ఒక్కో రోజు ఒక్కో ధర

ఎన్నో ఏళ్ల నుంచి పూల వ్యాపారం చేస్తున్నాం. ఒక రోజు ధర ఎక్కువ ఉంటే, మరో రోజు తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎంత ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఒక్కోసారి మేం అధిక ధరలకు మండీ నుంచి పూలు కొన్నాక ఉన్నట్టుండి మార్కెట్‌లో ధర తగ్గుతుంది. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాకు సున్నా వడ్డీకే రూ.10 వేలు ఇస్తామని జగనన్న ఇచ్చిన హామీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. 
 – మహబూబ్‌బీ, పూల వ్యాపారం, పాతబస్టాండు, ప్రొద్దుటూరు 

వడ్డీలేని రుణం ఓ వరం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్క వీధి విక్రయదారుడు, తోపుడు బండి వ్యాపారికి గుర్తింపు కార్డు ఇస్తామని ప్రకటించారు. దీనివల్ల అందరికీ రుణాలు పొందే అవకాశం లభిస్తుంది. వీధి వ్యాపారులకు రుణ సదుపాయం ఉన్నా ఎవరికీ పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముద్రరుణాలు కొందరికి మాత్రమే అందాయి. చాలా మందికి గుర్తింపు కార్డులు లేకపోవడంతో.. ఈ పరిస్థితి ఎదురైంది. 

ఇక్కట్లు తీరుతాయి

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తోపుడు బండ్ల వ్యాపారులకు చేయూతనిస్తారనే నమ్మకం ఉంది. సున్నా వడ్డీతో రూ.10 వేలు ఇస్తే దాన్నే పెట్టుబడిగా పెట్టుకుని వ్యాపారం చేసుకోవచ్చు. దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే ఇబ్బందులు తప్పుతాయి. మాకు జగనన్న ఆశాదీపంగా కనిపిస్తున్నారు. ఆయనతోనే మాకు బంగారు భవిష్యత్తు లభిస్తుంది.- మౌలాలి, పండ్ల వ్యాపారి, బద్వేలు 

మా కష్టాలు తెలుసుకున్నారు

తోపుడు బండ్లలో వ్యాపారం చేయాలంటే పలు ఇబ్బందులు ఉన్నాయి. పెట్టుబడికీ కష్టమే. బండి పెట్టుకునే స్థలానికీ ఇక్కట్లే. ఎండ, వాన, చలి లెక్క చేయకుండా వ్యాపారం చేసుకుంటేనే కుటుంబం గడిచేది. ఇలాంటి పరిస్థితుల్లో గుర్తింపు కార్డులు, వడ్డీలేని రుణం ఇస్తామనడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. – గౌస్‌పీర్, పండ్ల వ్యాపారి, బద్వేలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement