
‘‘హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ నన్ను వాడుకుని వదిలేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో నాదే కీలక పాత్ర,’’ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్‌రామ్ వాపోయారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 93 ఏళ్ల నేత మీడియాతో మాట్లాడుతూ, ‘‘ మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం తప్పో ఒప్పో నాకు తెలియదు. కాని, ఇవి నాకు చివరి ఎన్నికలు. జీవితకాలం గడిపిన పార్టీలో ఉండగానే కన్నుమూయాలనుకుంటున్నాను,’’ అని ఆయన చెప్పారు.
తన మనవడు, మండీ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆశ్రయ్ శర్మ తరఫున ఆయన ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేసిన సుఖ్‌రామ్‌పై 1998లో కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అరెస్టయి కొంత కాలం జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ తనను అవమానించిందని ఆయన అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ నా కుటుంబాన్ని బాగా ఉపయోగించుకుంది. విజయం సాధించాక నా కొడుకు అనిల్ శర్మకు మంత్రి పదవి ఇచ్చినా తగిన విలువ ఇవ్వలేదు.
ఆశ్రయ్‌కు మండీ బీజేపీ టికెట్ కోసం ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌ను కలవాలనుకున్నాను. ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఆశ్రయ్‌కు బీజేపీ సభ్యత్వం కూడా లేనప్పుడు అతనికి టికెట్ ఎలా ఇస్తామని సీఎం సహా బీజేపీ నేతలు ప్రశ్నించడంతో బీజేపీతో చెడిపోయింది. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించకున్నాను. నా మనవడి రాజకీయ భవిష్యత్తు కోసం నేను కాంగ్రెస్ మాజీ సీఎం వీరభద్రసింగ్‌ను క్షమాపణ కూడా కోరాను.
నేను పెట్టిన ప్రాంతీయపార్టీ హిమాచల్ వికాస్ కాంగ్రెస్ (హెచ్‌వీసీ) వల్ల 1998 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకే వీరభద్రకు నాపై కోపం ఉండొచ్చు,’’ అని సుఖ్‌రామ్ వివరించారు. అయితే, తన మనవడు ఆశ్రయ్‌ను వీరభద్ర ఆశీర్వదించారని, అతని కోసం మనస్పూర్తిగా ప్రచా రం చేస్తున్నారని ఆయన తెలిపారు. వయసు తొమ్మిది పదులు దాటినా ఆయన శారీరకంగా, మానసికంగా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. హిమాచల్‌లోని 4 లోక్‌సభ సీట్లకు మే 19న పోలింగ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment