సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల నుంచి దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికంగా పీడిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, అజీజ్ పాషాతో కలసి గురువారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ నాలుగేళ్లల్లో ప్రజలను పీడించి రూ.2 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని ఆరోపించారు. ప్రజలకు అవసరమైన, ముఖ్యమైన సంక్షేమ రంగాల్లో మాత్రం కేంద్రం కోత విధించిందని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటీశ్వరుల చేతిలో జాతీయ సంపద 85 శాతం పెరిగిందని, ధనికులకు మాత్రమే అచ్ఛేదిన్ వచ్చిందన్నారు.
బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, ఆ పార్టీ ముఖ్యమంత్రులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినా విచారణ చేయడానికి కేంద్రం ముందుకు రావడంలేదన్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నదన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోళ్లలో అవినీతిపై విచారణను మోదీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు.
ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు
దేశంలో వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆగస్టు 1 నుంచి 14 వరకు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినట్టు సురవరం వెల్లడించారు. నిత్యావసర ధరల పెరుగుదలపై 20న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ ఆసక్తి చూపడం లేదని, మమతాబెనర్జీ(పశ్చిమ బెంగాల్), అఖిలేష్ యాదవ్(ఉత్తరప్రదేశ్), స్టాలిన్(తమిళనాడు), హేమంత్ సోరేన్(జార్ఖండ్) వంటి వారంతా కాంగ్రెస్‌తోనే ఉంటున్నట్టుగా ప్రకటన చేశా రని సురవరం చెప్పారు.
ఒక రాష్ట్రానికి సీఎం అని కేసీఆర్‌తో మాట్లాడితే, రాజకీయంగా తన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టుగా ప్రచారం చేసు కుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆ ఫ్రంట్‌లో కేసీఆర్ మినహా ఎవరూ లేరని, ఉండరని అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఓట్లను, కూటమిని బల హీనపర్చడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ఫ్రంట్ బీజేపీకీ అనుకూలంగా, బీ–టీమ్‌గా పనిచేస్తున్నదని సురవరం ఆరోపించారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో లక్షకు పైగా ఖాళీలుంటే 26 వేల పోస్టుల్నే భర్తీ చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment