
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ప్రతిపాదిస్తున్న ఏకకాల ఎన్నికల విధానం దేశం కోసం కాదని, కేవలం ప్రధాని మోదీ ప్రయోజనం కోసమేనని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం సీపీఐ జాతీయ నాయకులతో కలసి మఖ్దూంభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఒక వ్యక్తి కోసం ఏకకాల ఎన్నికలు పెట్టడమంటే ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకున్న హక్కులను బలవంతంగా తీసుకోవడమే అవుతుందన్నారు.
ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకు తగినట్లు రాజకీయ పరిణామాలుంటాయని, వాటికి అనుకూలంగా ప్రభుత్వాలు సైతం మారతాయన్నారు. రాజస్తాన్‌లో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని భావించామని, కానీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఊహించలేదన్నారు. దీని ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటుందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై మోదీ ప్రభుత్వాన్ని పార్లమెంటులో ఎండగడతామని సురవరం చెప్పారు. అన్ని పార్టీల సమన్వయంతోనే కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ అజీజ్‌పాషా, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.