
సాక్షి, విజయవాడ : ఏపీలో బీజేపీపై కుట్ర, కుతంత్రాలతో టీడీపీ సర్కార్ వ్యవహరిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక పరిపాలన, అవినీతిపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో చర్చించామన్నారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని, ఏపీ సర్కార్ సూచనలతో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ వేధింపులకు నిరసనగా రేపు విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీజేపీ నాయకులు పర్యటిస్తారని, ఈనెల 12 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి విశిష్ట వ్యక్తుల మద్దతు కోరతామని.. 26వ తేదీన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం, సేవ్ డెమోక్రసి, సేవ్ వాల్యూస్ అనే పేరుతో అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పథకం ప్రకారమే టీడీపీ కేంద్రం అభివృద్దిని ప్రచారం చేయకుండా, ప్రధాని నరేంద్ర మోదీని దోషిగా చిత్రీకరిస్తోందని సురేష్ రెడ్డి మండిపడ్డారు.
‘టీడీపీ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై అసత్య ప్రచారం జరుగుతోంది. నీరు-చెట్టు నిధులు పక్కదారి పట్టాయి. ఏపీ సర్కార్ వేలకోట్ల నిధులు దుర్వినియోగం చేసింది. ఆఖరికి మరుగుదొడ్ల నిధులను కూడా స్వాహా చేస్తున్నారు. 7.80 లక్షల ఇళ్లు కేంద్రం ఒక్క ఏపీకే కేటాయించింది. తెలంగాణలో డబుల్ బెడ్ రూం యూనిట్ రూ.1000 అయితే.. ఏపీలో 2400కి యూనిట్ ఎందుకు ఉంది. పేదలపై భారం మోపుతూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నది వాస్తవం కాదా. ఏపీలోని ప్రతి ప్రాజెక్ట్ వెనుక లోపాయికారీ ఒప్పందాలన్నాయి. రాజధాని అమరావతి, సింగపూర్ కన్సార్టీయంలోనూ అక్రమాలు, అవకతవకలే.
అయితే విజయవాడ-గుంటూరు మెట్రోకు కేంద్రం అంగీకరించింది. ఏపీ ప్రభుత్వ అవినీతిని చూసి మెట్రో ఎండీ శ్రీధరన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌లో అవినీతి చూసి ఐవైఆర్ కృష్ణారావు తప్పుకున్నారు. సీఆర్‌డీఏలో అక్రమాలు చూసి కమిషనర్ శ్రీకాంత్ వెళ్లిపోయారు. ఐఏఎస్ అగర్వాల్ నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలి. నీరు-చెట్టులోని అవినీతికి ఈ నివేదిక అద్దం పడుతోంది. సీఆర్‌డీఏలో భూముల కుంభకోణం. లంక భూములు, అసైన్డ్ భూముల్లో ఎస్సీ, ఎస్టీల కడుపు కొట్టారు. రైతులకు 25వేల కోట్లు చెల్లిస్తామని, 13,646 కోట్లు మాత్రమే చెల్లించారు. 12వేల కోట్లు రైతులకు వడ్డీగా మారింది.
టీడీపీ సర్కార్ రైతుల నడ్డి విరిచింది. త్వరలోనే చంద్రబాబు సర్కార్ అవినీతి, కుంభకోణాలు బయటపెడతామని’ బీజేపీ నేత సురేష్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment