
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి..
సాక్షి, న్యూఢిల్లీ : గత లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ప్రస్తుతం ఆశావహ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌కు బీజేపీ చేరుకోలేదని ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్ చేపట్టిన మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంఓటీఎన్) సర్వే వెల్లడించింది. 543 స్ధానాలున్న లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు కేవలం 281 స్ధానాలు లభిస్తాయని, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమికి 122 స్ధానాలు లభిస్తాయని అంచనా వేసింది.
జులై 18 నుంచి జులై 29 మధ్య జరిగిన ఈ సర్వేలో ఇతరులకు గణనీయంగా 140 సీట్లు లభిస్తాయని పేర్కొంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 282 స్ధానాలను గెలుచుకోగా ఎన్‌డీఏ కూటమికి 336 సీట్లు దక్కాయి. విపక్ష కాంగ్రెస్ భారీ పరాజయం మూటగట్టుకుని కేవలం 44 సీట్లతో సరిపెట్టుకుంది.
ఇక ఎంఓటీఎన్ సర్వే ఎన్‌డీఏకు 36 శాతం ఓట్లు లభిస్తాయని, యూపీఏకు ఐదు శాతం తక్కువగా 31 శాతం ఓట్లు పోలవుతాయని లెక్కగట్టింది. ఇతరులకు యూపీఏ కన్నా అధికంగా 33 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది.