సస్పెండ్ అయిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్
హైదరాబాద్: నారాయణఖేడ్‌లో నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా, భూపాల్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చెయ్..నేను ఓడిపోతే ఉరేసుకుంటానని సస్పెండైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ సవాల్ విసిరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో టీఆర్‌ఎస్ అధిష్టానం, రాములు నాయక్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో రాములు నాయక్ బుధవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ నేతలను కలిశానంటున్నారు..ఎవరు ఎవరితో కలిశారో నార్కో టెస్ట్ చేయించుకుందామా అని సూటిగా అడిగారు. తనకు ఏ టికెట్ అవసరం లేదు..ఈ ఎన్నికల్లో పోటీచేయనని వ్యాక్యానించారు. తనకు కావాల్సింది గిరిజన రిజర్వేషన్లు మాత్రమేనని వెల్లడించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన గిరిజన రిజర్వేషన్లు ఎటుపోయాయని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో పచ్చి అబద్ధాల పుట్టగా అభివర్ణిస్తున్నట్లు చెప్పారు. 1200 మంది అమరుల ఆత్మ నిన్నటి వర్ష రూపంలో కురిసిందన్నారు. కొత్త వాగ్దానాలంతో ప్రజలను మోసం చేసేందుకు టీఆర్‌ఎస్ బయలు దేరిందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామాకాలన్నారు..నిధులు పార్టీలో కొంతమందికే వచ్చాయని ఆరోపించారు. నియామకాలు ఎటుపోయాయో తెలియదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం కల్ల అని శాపనార్ధాలు పెట్టారు. 20 ఏళ్ల అనుబంధాన్ని 20 నిమిషాల్లో కేటీఆర్ బొందపెట్టారని మండిపడ్డారు. ఎలాంటి షోకాజ్ ఇవ్వకుండా అహంకారంతో తనను సస్పెండ్ చేశారని వాపోయారు. తండాలు, గూడేలకే ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
రెండు కులాల మధ్య గతంలో ఏ ముఖ్యమంత్రి చిచ్చుపెట్టలేదని, గోండులకు..లంబాడాలకు, యాదవులకు..కురుమలకు, బెస్తలకు..ముదిరాజ్‌లకు మధ్య చిచ్చుపెట్టారని ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 25 నుంచి 30 సీట్లకు మించిరావని జోస్యం చెప్పారు. టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల్లో 70 మంది కుంటి గుర్రాలేనని వ్యాక్యానించారు. తెలంగాణ నేతలు ఆలె నరేంద్ర, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవ్ రావ్ జాదవ్‌లు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు కానీ హరికృష్ణ చనిపోతే ముఖ్యమంత్రి కుటుంబమంతా వెళ్లారని మండిపడ్డారు. రేపటి నుంచి నామీద భౌతిక దాడులు..ప్రెస్‌మీట్ల ద్వారా దాడి చేయిస్తారని ఆరోపించారు. నాకుటుంబ సభ్యులకు ఏం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment