జీఎస్టీపై తూటాల్లా పేలే మాటలతో ‘మెర్సెల్’..
ఒక్క ఓటు కోసం వ్యవస్థపైనే తిరుగుబాటు చేసిన ‘సర్కార్’..
అంటరాని వసంతానికి తెర మీద జరిగిన సెలబ్రేషన్ ‘కాలా’..
.. ఇవే కాదు, వ్యవస్థలోని లోటుపాట్లపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ, కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తూ, విమర్శనాత్మకంగా, సందేశాత్మకంగా ప్రభుత్వ వ్యతిరేకతపై గళమెత్తి మిర్చీ ఘాటులా ఉక్కిరిబిక్కిరి చేసిన చిత్రాలెన్నో తమిళనాట ‘సినిమా కామిక్కిరెన్’ (సినిమా చూపిస్త..) అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. మోదీకి మద్దతుగా బాలీవుడ్‌లో వచ్చిన సినిమాల కన్నా, ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణిలో మూడేళ్లలో కోలీవుడ్‌లో వచ్చిన డజనుకి పైగా సినిమాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. నిర్మాతలకు కాసులు కురిపించిన ఇవి.. ప్రతిపక్ష డీఎంకేకు ఓట్లు కురిపిస్తాయా?. ఎల్‌కేజీ, జోకర్, మెర్సెల్, ఇరుంబుతిరాయ్, తమిళ్ పాదం–2, నత్పే తున్నాయ్–2, కాలా, సర్కార్, ఉరియాడి.. మూడేళ్లలో కోలీవుడ్‌లో విడుదలైన సినిమాలివి. సమకాలీన రాజకీయాలపై, వ్యవస్థలో లోపాలపై వెండితెర గురి తప్పని షూటింగ్ ఇది. ఈ సినిమాలు తమిళ గడ్డపై మోదీ వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాయన్నది వాస్తవం. అది ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.
కేంద్రమే టార్గెట్..
నిరసనకారులందరూ రోడ్డెక్కి తమ గళం వినిపిస్తూ ఉంటే, కరడు గట్టిన రాజకీయ నాయకుడు నిర్దాక్షిణ్యంగా వారిపై కాల్పులకు ఆదేశిస్తాడు.. ఇది ఒక సిని మాలో సన్నివేశమే కావచ్చు. కానీ తమిళగడ్డపై వేదాంత గ్రూప్‌కు చెందిన స్టెరిలైట్ సంస్థని ఎత్తేయాలంటూ వీధుల్లోకి వచ్చిన నిరసనకారుల గుండెల్లో దిగిన పోలీసు తూటా సృష్టించిన రక్తపాతమే స్ఫురణకు వస్తుంది. అందరి కడుపు నింపే అన్నదాత తన కడుపు మాడ్చుకుంటూ ఢిల్లీ వీధుల్లో రోజుల తరబడి నిరసన చేసినా కనికరం చూపని కేంద్రం వైఖరి కళ్లకు కడుతుంది. తమ ప్రియతమ నాయకురాలు మరణం చుట్టూ కేంద్రం రాజకీయాలు చేసినట్టుగా వచ్చిన వార్తలు ఇంకా పచ్చిగానే తమిళ తంబిల మనసుల్లో నిలిచి ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు సామాన్యుడి జీవితాల్ని తలకిందులుగా చేసిన వైనం వెండితెరపై తూటాల్లా పేలే మాటలతో చీల్చి చెండాడుతుంటే ప్రేక్షకులు మురిసిపోయారు. ఆ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణిపై దళితుల ధిక్కారాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ సినిమాలో చూసి పండుగ చేసుకున్నారు. ఈ సినిమాలన్నీ ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్‌కి ఏ మేరకు ఓట్లు రాలుస్తాయో చెప్పలేం కానీ, మన వ్యవస్థలో లోటుపాట్లు, వాటిపై ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి జనం గుండెల్లోకి దూసుకుపోయేలా చేయడంలో విజయం సాధించాయని సినీ, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాలన్నీ కట్టుకథలని తమిళనాడు బీజేపీ శాఖ అంటోంది.
బాలీవుడ్ ఎందుకీ పని చేయలేకపోతోంది?
బాలీవుడ్ కూడా రాజకీయ, సామాజిక అంశాలతో సినిమాలు నిర్మిస్తూనే ఉంది. కానీ అవన్నీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ, దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. కానీ అవి ఏ మేరకు జనంపై ముద్ర వేశాయో నిపుణుల అంచనాలకు అందడం లేదు. తమిళ సినిమాలు ఓట్లు రాల్చినంతగా హిందీ రాష్ట్రాల ప్రజలు సినిమాలు చూసి ప్రభావితమై తమ ఓటింగ్ నిర్ణయం మార్చుకోరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో వచ్చిన ‘ఉరీ’ సినిమా యువతరాన్ని ఉర్రూతలూగించింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బయోపిక్ ‘యాక్సిడెంటల్ పీఎం’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇంకా ‘పాడ్ మ్యాన్’, ‘గోల్డ్’, ‘సత్యమేవ జయతే’, ‘పరమాణు’, ‘బాఘీ 2’, ‘మణికర్ణిక’ వంటి సినిమాలు బీజేపీ సిద్ధాంతాలకు ఊతమిచ్చేవిగా, జాతీయ భావాన్ని పెంచేవిగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిన్నతనంపై వచ్చిన ‘చలో జీతే హై’ షార్ట్ ఫిల్మ్ , స్వచ్ఛభారత్ కార్యక్రమంపై వచ్చిన ‘మేరే ప్యారే ప్రధానమంత్రి’ విమర్శకుల ప్రశంసలు పొందాయి కానీ జనం వాటిని ఎంత పట్టించుకున్నారనేది అనుమానమే.
రాజకీయాలతో ముడిపడిన సినిమాలు తీసి కమర్షియల్‌గా సక్సెస్ సాధించడం తమిళులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అందులో విషయం ఎంత సమగ్రంగా ఉందనేది ముఖ్యం కాదు. బుల్లెట్ దిగిందా లేదా! అదే కావల్సింది.
– సంతోష్ దేశాయ్, అడ్వర్టయిజింగ్ అండ్ మీడియా నిపుణుడు
ఇటీవల వచ్చిన తమిళ సినిమాల్లో.. పెత్తనమంతా కేంద్రానిదేనని, వారు ప్రవేశపెట్టే జనాకర్షక పథకాలన్నీ కాగితాలకే పరిమితమన్నట్టుగా చూపించారు. కానీ అవన్నీ శుద్ధ అబద్ధాలు. ‘పేట’, ‘సర్కార్’ వంటి సినిమాలు డీఎంకే పార్టీకి చెందిన సన్ పిక్చర్స్ తీసింది. అందుకే కట్టుకథలను జనంపైకి వదిలింది.
– ఎస్‌జీ సూర్య, బీజేపీ యూత్ వింగ్ అధ్యక్షుడు
తమిళులకు సినిమాలే ఊపిరి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి రాజకీయ దిగ్గజాలు సినిమాలతో వచ్చిన ఇమేజ్‌ను పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ఎదిగారు. ఇవాళ రేపు సినీ నిర్మాతలు రాజకీయాల్లోకి వచ్చి ఎదగాలని చూస్తున్నారు. ఈ విషయంలో కోలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్ ఎంతో వెనుకబడి ఉంది. ‘కాలా’ అంటే నలుపు. ద్రవిడ సిద్ధాంతానికి సంకేతం. దళితవాదానికి గుర్తు. అణగారిన బతుకులకు చిహ్నం. ‘కాలా’, ‘పేట’ వంటి సినిమాలు హిందూ అతివాద ధోరణిని ఉతికి ఆరేశాయి. వాటి ప్రభావం ప్రజలపై, ఎన్నికల్లో వారు తీసుకునే నిర్ణయంపై కచ్చితంగా ఉంటుంది.
– కవితా మురళీధరన్, రచయిత్రి
సింగపూర్‌లో 7% జీఎస్టీ వసూలు చేసి ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తుంటే, మన దేశంలో 28% జీఎస్టీ వసూలు చేస్తున్నా ఉచిత వైద్యం ఎవరికీ అందడం లేదు
(మెర్సెల్)
నలుపు శ్రమ జీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు.. మురికంతా ఇంద్రధనస్సులా కనిపిస్తుంది
(‘కాలా)
Comments
Please login to add a commentAdd a comment