
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని, ఇది రాజకీయ దిగజారుడుకు పరాకాష్ట అని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి మండి పడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేటీఆర్ ఉపయోగించిన పదజాలం అభ్యంతరకరమని.. ఎదుటివారిని చులకన చేస్తే ఉన్న తులం అవుతామనుకోవడం మంచిది కాదని సూచించారు.
శుక్రవారం పార్టీ నేతలు గీతా రెడ్డి, జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్‌తో కలసి జానారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఏహ్యమైన మాటలు మాట్లాడడం టీఆర్‌ఎస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు. కనీస సంస్కారంతో వ్యవహరించాలని.. హుందాగా, సంయమనంతో పద్ధతిగా ఉండాలని హితవు పలికారు. లోఫర్లు, బ్రోకర్లు, కాలిగోర్లు వంటి భాషతో సభ్యత, సంస్కారం నాశనమై.. రాజకీయ విలువలు దిగజారుతాయని పేర్కొన్నారు. ఇలా గతంలో కేసీఆర్ మాట్లాడినా, కాంగ్రెస్ నేతలు మాట్లాడినా.. వద్దని తాను వారించానన్నారు.
కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు: జీవన్‌రెడ్డి
జై తెలంగాణ అని ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. ఇప్పుడు జై ఆంధ్రా అనే స్థాయికి వచ్చారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేకున్నా, తెలంగాణ ఏర్పాటు ను ప్రధాని మోదీ అవమానించినా.. టీఆర్ ఎస్ స్పందించలేదేమని నిలదీశారు. కేసీఆర్ సీబీఐ కేసులకు భయపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై సభ్యత, సంస్కారం లేకుండా కేటీఆర్ మాట్లాడారని.. విదేశాల్లో తిరుగుతూ ఆయన నేర్చుకున్న విద్య, సంస్కారం ఇదేనా అని గీతారెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఇచ్చిన దేవత అంటూ కేసీఆర్ సహా కుటుంబ సభ్యులంతా సోనియా కాళ్ల దగ్గర మోకరిల్లారని పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాలను అమలు చేసిన కాంగ్రెస్‌పై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్‌కు లేదని సీఎల్పీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న కేటీఆర్‌ను ప్రజలు నమ్మక ద్రోహి అంటూ అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
గతంలో కాళ్లు పట్టుకున్నది ఏమైంది?
కాంగ్రెస్‌ను లోఫర్ అంటూ మాట్లాడుతున్నారని.. మరి టీఆర్‌ఎస్‌ను బ్రోకర్ పార్టీ అంటే ఏం చెబుతారని జానారెడ్డి ప్రశ్నించారు. కాలిగోరుతో పోల్చినవారే గతంలో కాళ్లు పట్టుకున్న దాన్ని ఏమనాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు కనీస గౌరవం ఇవ్వకపోవడం ప్రజలను బాధిస్తోందని, వారు సమయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ప్రధాని అయ్యే అవకాశమున్నా త్యాగం చేసిన నాయకుడు రాహుల్ అని... ప్రధాని మోదీని గుజరాత్‌లో మూడు చెరువుల నీళ్లు తాగించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment