గల్లంతైన బాబు కేబినెట్‌! | TDP 19 ministers were defeated | Sakshi
Sakshi News home page

గల్లంతైన బాబు కేబినెట్‌!

Published Fri, May 24 2019 6:51 AM | Last Updated on Fri, May 24 2019 7:34 AM

TDP 19 ministers were defeated - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మంత్రివర్గం దాదాపు గల్లంతైంది. 24 మంది మంత్రుల్లో 22 మంది పోటీచేయగా 19 మంది ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ప్రజల గురించి పట్టించుకోకుండా ఐదేళ్లు ఇష్టారాజ్యంగా అవినీతి వ్యవహారాల్లో మునిగితేలిన మంత్రులపై ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శాఖలపై ఏమాత్రం పట్టులేకుండా, కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ, ప్రతిరోజూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్న మంత్రులందరినీ ప్రజలు ఇంటిదారి పట్టించారు. చంద్రబాబు వీరవిధేయుడిగా ఆయన మంత్రివర్గంలో కీలకమైన జలవనరుల శాఖ నిర్వహిస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరంలో ఓటమిపాలయ్యారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, జగన్‌ అధికారంలోకి రావడం కలేనని డబ్బా కొట్టుకున్నా మైలవరం ప్రజలు మాత్రం ప్రజాప్రతినిధిగా పనికిరారని తేల్చి ఇంటికి పంపారు. దీంతో ఉమా నోటికి తాళం పడింది. తమ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్‌.. దేవినేని ఉమను ఓడించారు.  

కొల్లు, ప్రత్తిపాటి, సోమిరెడ్డి, నక్కా, ఆది సైతం.. 
మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర.. గుంటూరు జిల్లాకు చెందిన నక్కా ఆనంద్‌బాబుకు వేమూరులో పరాభవం ఎదురైంది. చంద్రబాబు కేబినెట్‌లో వ్యవ సాయ శాఖ మంత్రులుగా పనిచేసిన ఇద్దరూ ఓటమి పాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు, ఆ తర్వాత ఆ శాఖను చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరాజయం పొందారు. పుల్లారావు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విడదల రజనీ చేతిలో ఓడి పోయారు. సోమిరెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అలాగే, వ్యవసాయంలో అంతర్భాగంగా ఉన్న పశుసంవర్థక శాఖకు మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి కూడా కడప లోక్‌సభ నుంచి వైఎస్‌ అవినాష్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు.  

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ‘కళా’ కూడా.. 
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్‌ మంత్రి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఓడిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన ఓడిపోవడం టీడీపీ పతనావస్థను తెలుపుతోంది.  
- ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా రకరకాల సమీకరణలతో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేసిన పితాని సత్యనారాయణ, చెరకువాడ రంగనాథ రాజు చేతిలో ఓటమి చవిచూశారు.  
- గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గెలిచి మంత్రి అయిన కేఎస్‌ జవహర్‌పై అక్కడి కేడర్‌ తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు ఆయనకు కృష్ణా జిల్లా తిరువూరు సీటిచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. తిరువూరులో వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రక్షణనిధి చేతిలో జవహర్‌ ఓడిపోయారు.  
- చంద్రబాబు కేబినెట్‌లో సీనియర్‌ మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఘోరంగా ఓడిపోయారు.  
- ఇటీవల వరకూ మంత్రిగా ఉన్న అదే జిల్లాకు చెందిన కిడారి శ్రావణ్‌కుమార్‌ అరకులో పరాజ యం పాలయ్యారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హతమార్చడంతో ఆయన కొడుకు శ్రావణ్‌కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి సానుభూతి కార్డు ప్రయోగించినా ప్రజలు మాత్రం తిరస్కరించారు.  
- వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరా యించి మంత్రి పదవులు పొందిన సుజయకృష్ణ రంగారావు, అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవి పొందిన ఆదినారాయణరెడ్డి కడప ఎంపీగా పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు.  
- మంత్రిగా ఉండి ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగిన శిద్ధా రాఘవరావుకూ ఓటమి తప్పలేదు.   
- చంద్రబాబు సన్నిహితుడిగా.. ఆయన మంత్రివర్గంలో కీలకంగా ఉండి, రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మరో మంత్రి నారాయణ నెల్లూరు సిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చేతిలో ఓడిపోయారు.  
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన కుమారుడు శ్యాంబాబును పత్తికొండలో పోటీ చేయించినా గెలిపించుకోలేక చతికిలపడ్డారు. ఆయన సోదరుడు కేఈ ప్రతాప్‌ కూడా డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.  
అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కొడుకు శ్రీరామ్‌ను గెలిపించలేక చేతులెత్తేశారు.  
సమాచార శాఖ మంత్రిగా ఉన్న కాల్వ శ్రీనివాసరావుకూ రాయదుర్గంలో పరాభవం ఎదురైంది. 
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడు, విశాఖ నార్త్‌లో గంటా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాత్రమే అతికష్టంపై గెలిచారు. మిగిలిన మంత్రులంతా ఓడిపోవడంతో రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు కేబినెట్‌ అత్యంత ప్రజావ్యతిరేకమైనదిగా స్పష్టమైంది.

మంగళగిరిలో బోర్లాపడ్డ లోకేశ్‌
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు కూడా గుంటూరు జిల్లా మంగళగిరిలో పరాభవం తప్పలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఆయన ఓడిపోవడం ఈ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న ఈ స్థానంలో గెలుపొందేందుకు లోకేశ్‌ వందల కోట్లు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుచేశారు. అయినా ప్రజలను ఆకర్షించలేకపోవడం, తరచూ తప్పులు మాట్లాడుతుండడంతో ప్రజల్లో బాగా చులకనైపోయారు. అయినా, చంద్రబాబు తన తనయుణ్ణి గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేకపోయారు. నిజానికి ఎమ్మెల్యేగా పోటీచేసే పలువురిని ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించిన చంద్రబాబు లోకేశ్‌ను మాత్రం రాజీనామా చేయించలేదు. ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోయినా దొడ్డిదారిన వచ్చిన ఎమ్మెల్సీ పదవితో కాలక్షేపం చేసే ఉద్దేశంతో లోకేశ్‌ ఆ పదవిని అంటిపెట్టుకునే ఉన్నారు. ఏమాత్రం సమర్థత లేకపోయినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయడం, ఏకంగా కీలకమైన మూడు శాఖలు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వచ్చినా చంద్రబాబు లెక్కచేయలేదు. కొడుకును పార్టీపైనా, ప్రజలపైనా రుద్దేందుకు ప్రయత్నించినా ప్రజాక్షేత్రంలో మాత్రం విఫలంకాక తప్పలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement