సాక్షి, అమరావతి: సినీ నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఓటర్లు మట్టి కరిపించారు. ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా తిరిగి టీడీపీ గెలుపు కోసమే ఆ పార్టీ పోటీ చేస్తోందని విశ్వసించిన ఓటర్లు ఆ పార్టీని పూర్తిగా తిర్కసరించారు. భీమవరం (పశ్చిమగోదావరి), గాజువాక (విశాఖపట్నం)ల నుంచి పోటీ చేసిన పవన్ రెండుచోట్లా ఓడారు. మొత్తం 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే కేవలం ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే అత్తెసరు మెజార్టీతో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఏడు శాతం లోపు ఓట్లు మాత్రమే దక్కించుకుంది.
టీడీపీతో కుమ్మక్కు రాజకీయాల వల్లే..
2014 ఎన్నికల ముందే జనసేన పార్టీని ఏర్పాటు చేసినా ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిచ్చింది. ఆ తర్వాత కూడా పవన్ దాదాపు నాలుగేళ్ల పాటు టీడీపీకే ప్రతి సందర్భంలో మద్దతిస్తూ వచ్చారు. ప్రశ్నించడానికే జనసేన స్థాపించానంటూ వల్లె వేస్తూ వచ్చిన పవన్.. చంద్రబాబు ప్యాకేజీలకు ‘ఖర్చ’వుతూ వచ్చారు. తిరిగి ఈ ఎన్నికలకు ఏడాది ముందు నుంచి చంద్రబాబును విభేదిస్తూ తన రాజకీయాలను కొనసాగించారు. అయితే, ఈ కాలంలో టీడీపీపై అప్పడప్పుడూ విమర్శలు చేసినా.. రహస్య మిత్రులుగా కొనసాగుతూ వచ్చారన్న విమర్శలున్నాయి.
సీఎం తనయుడు లోకేష్ పోటీ చేసే మంగళగిరిలో కనీసం జనసేన అభ్యర్థిని నిలబెట్టకుండా సీపీఎంనే పవన్ పోటీలో ఉంచారు. సీఎం చంద్రబాబు సైతం పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబును వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. పవన్ వ్యవహారశైలిని నిశితంగా పరిశీలించిన ఓటర్లు.. కర్రుకాల్చి వాత పెట్టారు. పవన్‌తోపాటు నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సోదరుడు కొణిదెల నాగబాబును సైతం చిత్తుగా ఓడించారు. అక్కడ వైఎస్సార్‌సీపీ ప్రభంజనంలో నాగబాబు మూడో స్థానానికి దిగజారారు.
జనం నమ్మని జనసేన
Published Fri, May 24 2019 7:08 AM | Last Updated on Fri, May 24 2019 10:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment